IND vs ENG | లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మొదటి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు 387 పరుగులు చేయడంతో మ్యాచ్ ఆదివారం ఆట రసవత్తరంగా మారనుంది. అయితే మూడో రోజు ఆట చివరలో మైదానంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆట ముగిసే సమయానికి భారత ఆటగాళ్లు, ఇంగ్లండ్ ఓపెనర్లు మధ్య మాటల తూటాలు పేలాయి. మూడో రోజు ఆఖరి ఓవర్లో జస్ప్రీత్ బూమ్రా బౌలింగ్ చేస్తున్న సమయంలో, ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలీ , బెన్ డకెట్ మ్యాచ్‌ని నిలిపేయాలన్న ఉద్దేశంతో పదే పదే అంతరాయం కలిగించారు. బూమ్రా రన్నప్ మొదలైన వెంటనే స్టాన్స్ మార్చడం, చిన్న గాయాన్ని చూపిస్తూ ఫిజియోలను పిలవడం మొదలుపెట్టారు. దీంతో భారత ఆటగాళ్లకు కోపం వచ్చి, వారిపట్ల ధీటుగా స్పందించారు.
ఇంగ్లండ్ ఆటతీరు చూసి తీవ్ర అసహనానికి గురైన కెప్టెన్ శుభ్‌మన్ గిల్, జాక్ క్రాలీతో నేరుగా వాగ్వాదానికి దిగాడు. కొన్ని బూతు పదాలు కూడా వాడినట్టు వీడియోల ద్వారా తెలుస్తోంది. అదే సమయంలో మహ్మద్ సిరాజ్ కూడా మాటలతో కౌంటర్ చేశాడు. ఇతర భారత ఆటగాళ్లు చప్పట్లు కొడుతూ జాక్ క్రాలీ చుట్టూ చేరారు. క్రాలీ మాత్రం కూల్‌గా తన పని చేసుకుంటూ బూమ్రా ఓవర్‌ను పూర్తి చేశాడు. ఆ వెంటనే అంపైర్లు ఆటను నిలిపేశారు, కానీ మైదానంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలు నెట్టింట మాత్రం వైరల్ అయ్యాయి. గిల్ .. కోహ్లీ వారసత్వాన్ని నిజంగా అందుకున్నాడు అంటూ అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఇష్యూపై ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ మాట్లాడుతూ.. గిల్ కూడా కండరాల నొప్పి అంటూ సమయం వృథా చేశాడు అని అన్నాడు. మైదానంలో మసాజ్ చేయించుకున్నాడు. అప్పుడు అతనిపై మేము ఎలాంటి ఫిర్యాదు చేయలేదు కదా. మరి మా మీద ఎందుకు ఫిర్యాదు చేస్తున్నారో తెలియడం లేదు అంటూ సౌథీ అన్నారు. కాగా, భారత జట్టు రెండో రోజు 145/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో ఆరంభించి 387 పరుగులకే ఆలౌటైంది. అదే స్కోరుతో ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ ముగియడంతో, మ్యాచ్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. మ్యాచ్ ఫలితం ఎలా ఉంటుందనేది నాలుగో రోజు మొదటి సెషన్‌పై ఆధారపడి ఉంటుంది.భారత బౌలర్లు ఇంగ్లండ్‌ను త్వరగా ఆలౌట్ చేస్తే గెలుపు దిశగా అడుగులు వేస్తారు. లేదంటే మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉంది.
For those who have missed the hollywood level acting of Zak Crawley. pic.twitter.com/uEuU70tVIp
— R A T N I S H (@LoyalSachinFan) July 12, 2025