భారత సారథిగా టెస్టుల్లో తొలి రెండు మ్యాచ్‌ల్లో సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ, హజారే, గవాస్కర్ తర్వాత గిల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
బర్మింగ్హమ్: ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టు సారథి శుభ్‌మన్ గిల్ శతకాల మోత (216 బంతుల్లో 114 నాటౌట్, 12 ఫోర్లు) మోగిస్తున్నాడు. ఈ మ్యాచ్‌కు ముందు హెడింగ్లీ టెస్టులోనూ సెంచరీతో మెరిసిన టీమ్ఇండియా కెప్టెన్.. ఎడ్జ్‌బాస్టన్ (బర్మింగ్హమ్) వేదికగా బుధవారం నుంచి మొదలైన రెండో టెస్టులోనూ మూడంకెల స్కోరుతో చెలరేగడంతో భారత్ భారీ స్కోరుదిశగా సాగుతున్నది. గిల్‌తో పాటు ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (107 బంతుల్లో 87, 13 ఫోర్లు), రవీంద్ర జడేజా (67 బంతుల్లో 41 నాటౌట్, 5 ఫోర్లు) రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 85 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 310 పరుగులు చేసింది. ఇంగ్లీష్ బౌలర్లలో లోకల్ బాయ్ క్రిస్ వోక్స్‌కు రెండు వికెట్లు దక్కగా కార్స్, స్టోక్స్, బషీర్ తలా ఒక వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడిన భారత్.. తుది జట్టులో మూడు మార్పులతో బరిలోకి దిగింది. స్టార్ పేసర్ బుమ్రాకు విశ్రాంతినిచ్చిన టీమ్ మేనేజ్మెంట్.. తొలి టెస్టులో ఆడిన శార్దూల్, సుదర్శన్‌ను పక్కనబెట్టింది. వీరి స్థానాల్లో ఆకాశ్ దీప్తో పాటు ఆల్‌రౌండర్ కోటాలో నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్‌ను ఫైనల్ లెవన్‌లో చేర్చింది. స్టోక్స్ ఆహ్వానం మేరకు మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియాకు 9వ ఓవర్లోనే ఎదురుదెబ్బ తగిలింది. హెడింగ్లీలో శతకంతో మెరిసిన కేఎల్ రాహుల్ (2).. వోక్స్ వేసిన బంతిని వికెట్ల మీదకు ఆడుకుని క్లీన్‌బౌల్డ్ అవడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మూడో స్థానంలో వచ్చిన కరుణ్ నాయర్ (31) ఆత్మవిశ్వాసంతో ఆడాడు. టంగ్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు సాధించిన అతడు.. ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో కుదురుకున్నాక టంగ్ ఓవర్లో 3 ఫోర్లతో జోరుపెంచిన జైస్వాల్.. అతడే వేసిన 22వ ఓవర్లో హ్యాట్రిక్ బౌండరీలతో 59 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు. లంచ్‌కు రెండు ఓవర్ల ముందు బౌలింగ్ మార్పుగా వచ్చిన కార్స్.. భారత్‌కు మరో షాకిచ్చాడు. అతడు వేసిన షార్ట్ బంతిని ఆడబోయిన కరుణ్.. స్లిప్స్‌లో బ్రూక్‌కు దొరికిపోవడంతో 80 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
రెండో సెషన్లో టీమ్ఇండియా నిలకడగా ఆడింది. జైస్వాల్, గిల్ ఇద్దరూ ధాటిగా ఆడకపోయినా రన్‌రేట్ 4కు పడిపోకుండా ఆడారు. అయితే డ్రింక్స్ విరామం తర్వాత శతకానికి చేరువవుతున్న జైస్వాల్‌ను.. స్టోక్స్ 46వ ఓవర్లో ఔట్ చేసి 66 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత పంత్ (25)తో కలిసి గిల్.. భారత ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ఈ క్రమంలో బషీర్ బౌలింగ్‌లో బౌండరీతో అతడి హాఫ్ సెంచరీ పూర్తయింది. కానీ పంత్.. బషీర్ 61వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి లాంగాన్ వద్ద క్రాలీ చేతికి చిక్కాడు. నితీశ్ కుమార్ (1)ను వోక్స్ అద్భుత డెలివరీతో క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఈ తరుణంలో కాస్త నెమ్మదించిన గిల్.. జడేజా సాయంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఒక్కో పరుగును కూడదీసుకుంటూ బాధ్యతాయుతంగా ఆడిన గిల్.. టంగ్ ఓవర్లో బౌండరీతో 90లలోకి చేరాడు. రూట్ 80వ ఓవర్లో ఫైన్ లెగ్ దిశగా రెండు వరుస బౌండరీలతో టెస్టులలో ఏడో శతకాన్ని, సారథిగా మూడు ఇన్నింగ్స్‌లలోనే రెండో సెంచరీని నమోదుచేశాడు. గిల్, జడ్డూ ఆరో వికెట్‌కు అజేయంగా 99 పరుగులు జోడించారు. ఇక ఈ సిరీస్‌కు ముందువరకు ఇంగ్లండ్‌లో గిల్ అత్యుత్తమ స్కోరు 28 పరుగులే కాగా రెండు టెస్టులలో అతడు ఏకంగా రెండు శతకాలు సాధించడం విశేషం.
భారత్ తొలి ఇన్నింగ్స్: 85 ఓవర్లలో 310/5 (గిల్ 114*, జైస్వాల్ 87, వోక్స్ 2/59, కార్స్ 1/49)