Asia Cup | సెప్టెంబర్‌లో యూఏఈ వేదికగా జరుగనున్న ఆసియా కప్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును బీసీసీఐ గురువారం ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత జట్టు ఈ టోర్నమెంట్లో ఆడనున్నది. శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసియా కప్ వచ్చే నెల 9 నుంచి మొదలుకానుండగా.. టీమిండియా తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న ఆడుతుంది. అయితే, సీనియర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌కు బీసీసీఐ మళ్లీ చోటు కల్పించకుండా మొండి చేయి చూపింది. టీ20 జట్టులో తప్పనిసరిగా అయ్యర్‌కు చోటు దక్కుతుందని అంతా భావించారు. బీసీసీఐ నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్లో శ్రేయాస్ బ్యాట్‌తో ఆకట్టుకున్నాడు. కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్‌ను ఫైనల్ వరకు నడిపించాడు.
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌తో కలిసి విలేకరుల సమావేశంలో జట్టును ప్రకటించారు. అయితే, అయ్యర్‌కు ఎందుకు చోటు కల్పించలేదన్న ప్రశ్నించగా.. అగార్కర్ మాట్లాడుతూ యశస్వీ జైస్వాల్ విషయంలో ఇది దురదృష్టకమని వ్యాఖ్యానించాడు. అయ్యర్ విషయంలో ఇదే పరిస్థితి అని చెప్పారు. అయ్యర్‌కు చోటు కోసం జట్టులో నుంచి ఎవరిని తప్పించాలని ప్రశ్నించాడు. ఈ విషయంలో శ్రేయస్ అయ్యర్ తప్పిదం లేదని, తమ తప్పు కూడా లేదని చెప్పుకొచ్చాడు. అయ్యర్, జైస్వాల్ జట్టులో తప్పనిసరి పరిస్థితుల్లో చోటు కోల్పోవాల్సి వచ్చిందన్నాడు. యశస్వి జైస్వాల్ అవకాశం కోసం వేచి చూడడం దురదృష్టకరమని.. అభిషేక్ శర్మ ఓపెనర్‌గా అద్భుత ప్రదర్శన కనబరడంతో పాటు జట్టుకు ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ లభిస్తుందన్నాడు.
తమకు 15 మంది ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చాడు. ఇంకా జట్టులోకి ఎక్కువ మందిని తీసుకునే అవకాశం ఉంటే.. జట్టులో చేర్చుకునే వాళ్లమని స్పష్టం చేశారు. భారత జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా గురించి సూర్యకుమార్ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచ కప్ తర్వాత.. బుమ్రా టెస్ట్ క్యాలెండర్లో బిజీగా ఉన్నాడని.. ఇప్పుడు అతనికి సమయం ఉందని.. దాంతో జట్టులోకి తిరిగి వస్తున్నాడని పేర్కొన్నారు. బుమ్రా టీ20 జట్టులో చేరడం సంతోషంగా ఉందని అగార్కర్ తెలిపాడు. బుమ్రా ఎప్పుడూ అందుబాటులో ఉండాలని తాము కోరుకుంటున్నామని.. కానీ, గాయాలు అతన్ని చాలా ఇబ్బందిపెట్టాయని.. ఫిజియో పర్యవేక్షిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఎక్కువ సమయంలో అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నట్లు అగార్కర్ వివరించారు.