Shreyas Iyer : ఆసియా కప్ స్క్వాడ్‌లో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)కు సెలెక్టర్లు కొత్త బాధ్యతలు అప్పగించారు. రోహిత్ శర్మ (Rohit Sharma) వారసుడిగా వన్డే ఫార్మాట్‌కు కాబోయే సారథి అనిపించుకుంటున్న అయ్యర్‌కు.. భారత ‘ఏ’ జట్టు కెప్టెన్సీ అప్పగించారు. సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియా ఏ జట్టుతో జరుగబోయే రెండు మల్టీ డే మ్యాచ్‌లకు సర్పంచ్ సాబ్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు.
ఆస్ట్రేలియా ఏ జట్టుతో మ్యాచ్‌లకు శనివారం సెలెక్టర్లు 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్రకటించారు. ఈ సిరీస్‌లో అయ్యర్‌కు డిప్యూటీగా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) సహకరించనుండగా.. పలువురు టెస్టు ఆటగాళ్లను బృందలోకి తీసుకున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో మెరిసిన సాయి సుదర్శన్, ప్రసిధ్ కృష్ణలతో పాటు దేశవాళీ హీరో అభిమన్యు ఈశ్వరన్, ఐపీఎల్ స్టార్లు ఆయుశ్ బదొని, దేవ్‌దత్ పడిక్కల్ ఉన్నారు.
🚨 NEWS 🚨
India A squad for two multi-day matches against Australia A announced.
Details 🔽 #TeamIndiahttps://t.co/PJI6lWxeEQ pic.twitter.com/2gqZogQKnN
— BCCI (@BCCI) September 6, 2025
దేశవాళీలో ముంబై తరఫున ఇరగదీస్తున్న తనుష్ కొతియాన్, సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్, వికెట్ కీపర్‌గా ఎన్.జగదీశన్ స్క్వాడ్‌లో చోటు సంపాదించారు. ఆసియా కప్ బృందంలో లేని సిరాజ్, కేఎల్ రాహుల్ సైతం రెండో మ్యాచ్‌కు భారత ఏ జట్టుతో చేరుతారని సమాచారం.
భారత ఏ స్క్వాడ్ : శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), అభిమన్యు ఈశ్వరన్, ఎన్.జగదీశన్(వికెట్ కీపర్), సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్ (వైస్ కెప్టెన్, వికెట్ కీపర్), దేవ్‌దత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదొని, నితీశ్ రెడ్డి, తనుష్ కొతియాన్, ప్రసిధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్.
భారత ఏ, ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య సెప్టెంబర్ 23న తొలి మ్యాచ్ జరుగనుంది. రెండు మల్టీ డే మ్యాచ్‌ల తర్వాత ఇరుజట్లు మూడు వన్డేల్లో తలపడనున్నాయి. కాన్పూర్ వేదికగా సెప్టెంబర్ 30న తొలి వన్డే, అక్టోబర్ 3న రెండో వన్డే, అక్టోబర్ 5న మూడో వన్డే నిర్వహించనున్నారు. స్వదేశంలో వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్, రాహుల్, ప్రసిధ్‌కు ఇవి ప్రాక్టీస్ మ్యాచ్‌లుగా పనికొస్తాయి.