ముంబై : వచ్చే నెలలో జరగనున్న ఆసియాకప్‌కు.. శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer)ను బీసీసీఐ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. టాప్ ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను ఎందుకు ఆ టోర్నీ కోసం ఎంపిక చేయలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ వర్గాలు ఓ కీలక అప్డేట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రధాన ఆంగ్ల మీడియాలో వచ్చిన కథనం ప్రకారం.. భవిష్యత్తులో శ్రేయాస్ అయ్యర్‌ను వన్డే కెప్టెన్‌గా ప్రకటించే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు తెలుస్తోంది. రోహిత్ శర్మకు లాంగ్ టర్మ్ ఆప్షన్‌గా అయ్యర్‌కు బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఓ కథనం పేర్కొన్నది. రోహిత్ శర్మ టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సెప్టెంబర్ 9వ తేదీ నుంచి జరగనున్న ఆసియాకప్‌కు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా గిల్ నియమితులయ్యారు. అయితే ఆ టోర్నీ కోసం శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయలేదు. ఈ వివాదం నేపథ్యంలో బీసీసీఐ ప్రణాళిక ఒకటి బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆసియా కప్ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాతో ఇండియా వన్డే సిరీస్ ఆడనున్నది. అయితే ఆసియాకప్ టోర్నీ ముగిసిన తర్వాత ఆసీస్‌తో జరిగే వన్డేలకు జట్టును బీసీసీఐ ప్రకటిస్తుంది. ఆ సిరీస్‌కు అయ్యర్‌ను ఎంపిక చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియాతో అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు ఫేర్వెల్ సిరీస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు ఇద్దరు సీనియర్లకు బీసీసీఐ స్వేచ్ఛను ఇచ్చింది. ఇక కెప్టెన్సీ బాధ్యతలను కూడా రోహిత్ నుంచి తప్పించేందుకు బీసీసీఐ ప్లాన్ చేస్తున్నది. ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్‌లు చివరి మ్యాచ్‌లు ఆడే అవకాశాలు ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తెలిసింది. అయితే 2027లో జరిగే వన్డే వరల్డ్‌కప్ వరకు కూడా కోహ్లీ, రోహిత్‌లు ఆడుతారని కూడా కొందరు అంటున్నారు.