హైదరాబాద్ : తప్పక గెలవాల్సిన పోరులో పంజాబ్(PBKS) గెలిచి నిలిచింది. శ్రేయస్ అయ్యర్ సూపర్ సెంచరీ (101) చేసి కేవలం 18 ఓవర్లలోనే లక్నో సూపర్ జెయింట్స్ ను ఓడించాడు. మహమ్మద్ షమీ బౌలింగ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయిన పంజాబ్ జట్టును కెప్టెన్ అయ్యర్ చివరి వరకు ముందుండి నడిపించాడు. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ ఆరు మ్యాచ్‌ల పరాజయ పరంపరకు తెరదించి, ప్లేఆఫ్ రేసులో నిలిచింది. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో ఈ సంవత్సరం తన ప్రదర్శన సంతృప్తి నిచ్చిందన్నారు.
జట్టుకు కీలక సమయంలో గెలుపునందించడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు. ఓటమి పరంపరకు బ్రేక్ వేసినందుకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు పీబీకేఎస్ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు. ఇక ప్లేఆఫ్స్‌కు చేరాలంటే మా ఆశలన్నీ ముంబయి-రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌పై ఆధారపడి ఉందన్నారు. మా అభిమానులు ముంబైకి మద్దతుగా నిలవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఒమర్జాయ్, చాహల్‌లను ప్రశంసించారు.
ఒత్తిడితో కూడిన ఈ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లను మానసికంగా తాజాగా ఉంచడానికి కారణం ఎవరికి ఉపదేశాలు ఇవ్వకుండా ప్రశాంతంగా ఎవరి పని వారు చేసుకున్నామని తెలిపాడు. కాగా, 14 మ్యాచ్‌లు ఆడిన పంజాబ్15 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌లో ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్‌పై(MI) గెలిస్తే ఎలాంటి సమీకరణాలకు సంబంధం లేకుండా పంజాబ్ ఇంటిబాట పట్టాల్సిందే. అప్పుడు ఆర్ఆర్ 16 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలుస్తుంది.