Shreyas Iyer | చెన్నై: గాయం నుంచి ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదని భారత మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నాడు. వెన్నునొప్పి తీవ్రత చూస్తే.. తన కెరీర్ ముగిసినట్లే అనిపించిందని అయితే.. పట్టుదలతో తిరిగి కోలుకొని జట్టుకు ఎంపికవడం చాలా సంతోషంగా ఉందని అయ్యర్ అన్నాడు. పునరాగమనం వెనుక పెద్ద కథ ఉందని.. ముఖ్యంగా వైద్యులు, సహాయక సిబ్బంది సహకారం వల్లే మళ్లీ జట్టులో చోటు దక్కించుకోగలిగానని అయ్యర్ వెల్లడించాడు.
దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ఆదివారం ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘వెన్నెముక గాయం కారణంగా నరాలపై ఒత్తిడి పడి భరించలేని నొప్పి ఎదుర్కొన్నా. శస్త్రచికిత్స అనంతరం ఇంత త్వరగా కోలుకుంటానని అనుకోలేదు. ఏది ఏమైనా భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది’ అని అయ్యర్ అన్నాడు.