ముంబై: టీమిండియా టీ20 జట్టులో భారీ మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇండియాకు 2026 టీ20 వరల్డ్‌కప్‌ను సూర్యకుమార్ అందించిన విషయం తెలిసిందే. అయితే అతన్ని సారథ్యం నుంచి తప్పించాలని బీసీసీఐ(BCCI) వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ .. కొత్త కెప్టెన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్‌కు ఛాన్స్ ఇవ్వాలని బీసీసీఐ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈ యేటి ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ ఇరగదీస్తున్నాడు. రాబోయే సిరీస్‌ల్లో కెప్టెన్సీతో పాటు యువ ఆటగాళ్లకు కూడా అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నది.
ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వెళ్లే జట్టుల్లో యువతకు చోటు దక్కే ఛాన్సు ఉన్నది. ఇటీవల సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌కు పెద్దగా పనిచెప్పడం లేదు. సూర్య రాణించలేకపోతున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. సెలక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్ కూడా సూర్య విషయంలో సహనాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది. ఫామ్‌లో లేని సూర్య స్థానంలో శ్రేయాస్‌ను కెప్టెన్‌గా దించాలని భావిస్తున్నారు. మరీ పేలవంగా ఆడుతున్న సూర్య టీమిండియా బృందంలో చోటు దక్కించుకుంటాడా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నిజానికి టీ20ల్లో సూర్యకు మంచి రికార్డు ఉన్నది. కానీ ఇటీవల అతని ఫామ్ సరిగాలేదు. ఐపీఎల్ లో ఈసారి అతను ముంబై ఇండియన్స్ తరపున 10 మ్యాచుల్లో కేవలం 195 రన్స్ మాత్రమే చేశాడు. అయితే చేతిమడిమ సమస్యతో సూర్య బాధపడుతున్నాడని, అయినా నొప్పితోనే ఆడుతున్నాడని ఓ నివేదిక ద్వారా తెలిసింది. ఇక శ్రేయాస్ అయ్యర్ ఈ ఐపీఎల్ సీజన్లో 9 మ్యాచుల్లో 333 రన్స్ చేశాడు. అయితే రోహిత్ శర్మ కెప్టెన్‌గా రిటైర్మెంట్ అయిన తర్వాత సూర్యకుమార్ ఇప్పటి వరకు ఒక్క టీ20 సిరీస్‌ను కూడా కోల్పోలేదు. ఇక అయ్యర్ గత రెండేళ్ల నుంచి ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. 2023 డిసెంబర్లో చివరిసారి అతను ఇండియా తరపున ఆడాడు.