ముంబై : యూఏఈలో జరుగనున్న ఆసియా కప్ టోర్నీకి శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేయకపోవడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 12 ఏండ్ల విరామం తర్వాత భారత్..ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ గెలువడంలో కీలకంగా వ్యవహరించిన అయ్యర్‌ను పక్కకు పెట్టడంపై బీసీసీఐ వైఖరిని తప్పుబడుతున్నారు. దీనికి తోడు ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లోనూ పంజాబ్ కింగ్స్‌ను తన నాయకత్వ శైలితో ఫైనల్‌కు చేర్చిన అయ్యర్‌కు తగిన న్యాయం జరుగలేదంటూ అటు మాజీ క్రికెటర్లు మద్దతుగా నిలువగా, పలువురు సోషల్‌మీడియాలో తమదైన శైలిలో బీసీసీఐ ఎంపిక ప్రక్రియను విమర్శిస్తున్నారు. తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పే సత్తా ఉన్న ఈ స్టార్ బ్యాటర్‌ను తప్పించడానికి గల కారణాలు ఏంటో బోర్డు పెద్దలు స్పష్టం చేయాలని సోషల్‌మీడియా ఖాతాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
మూడు రోజుల క్రితం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలెక్షన్ కమిటీ సూర్యకుమార్‌యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్‌గిల్ వైస్ కెప్టెన్‌గా నియమిస్తూ 15 మందితో జట్టును ఎంపిక చేసింది. అందరూ ఊహించినట్లుగానే గిల్‌ను భవిష్యత్ టీ20 కెప్టెన్‌గా భావిస్తున్న బీసీసీఐ అందుకు తగ్గట్లు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, సూపర్‌ఫామ్‌లో ఉన్న అయ్యర్‌ను మాత్రం అసలు పరిగణనలోకి తీసుకోలేదు. శ్రేయాస్‌ను ఎంపిక చేయకపోవడంపై అగార్కర్ స్పందిస్తూ ప్రస్తుతం జట్టులో ఎవరిని తీసివేసే పరిస్థితి లేదని, మరికొన్ని రోజులు అయ్యర్ వేచిచూడాలని చావు కబురు చల్లగా చెప్పాడు. దీనిపై సోషల్‌మీడియాలో అగార్కర్, బోర్డు వైఖరిపై తారా స్థాయిలో ట్రోల్స్ చేశారు. మాజీ క్రికెటర్లు రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, అభిషేక్ నాయర్, ఎమ్మెస్కే ప్రసాద్..అయ్యర్‌కు మద్దతుగా గళం విప్పారు. టీ20ల్లో మెరుగైన రికార్డు ఉన్న అయ్యర్ ఎందుకు తప్పించారో చెప్పాలంటూ ప్రశ్నించారు.
17 కాకుండా 15 మందితో : ఏషియన్ క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) నిబంధనల ప్రకారం వాస్తవానికి 17 మంది ప్లేయర్లతో జట్టును ప్రకటించేందుకు అవకాశముంది. టోర్నీలో పోటీపడే జట్లు 17 మంది ఎంపిక చేసుకోవచ్చని నిబంధనలు ఉన్నా..బీసీసీఐ అందుకు భిన్నంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జట్టులో 17 మంది ప్లేయర్లకు తోడు 8 మంది సహాయక సిబ్బందితో మొత్తంగా 25 మంది ఉండవచ్చని ఏసీసీ నిబంధనల్లో స్పష్టంగా ఉంది. ఇదే టోర్నీలో పోటీపడుతున్న పాకిస్థాన్, హాంకాంగ్ 17 మందితో జట్టును ప్రకటించగా, 15 మందిని ఎంపిక చేసిన బీసీసీఐ కనీసం స్టాండ్‌బై ప్లేయర్ల జాబితాలోనూ అయ్యర్‌కు అవకాశమివ్వకపోవడం గమనార్హం. ‘17 మందితో జట్టును ప్రకటించే అవకాశమున్నప్పుడు ఎందుకు బీసీసీఐ సద్వినియోగం చేసుకోలేదు. మరో ఇద్దరు ప్లేయర్లతో ఆడేందుకు ఆస్కారముండేది’అని ప్రసాద్ అన్నాడు.
భారత టీ20 జట్టు ఎంపికయ్యేందుకు శ్రేయాస్ ఇంకా ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐపీఎల్లో ఢిల్లీ నుంచి కోల్‌కతా, కోల్‌కతా నుంచి పంజాబ్ ఇలా ప్రతీ సీజన్‌కు మెరుగైన ఫలితాలు రాబడుతున్నాడు. అతన్ని భారత కెప్టెన్‌గా చేయమని నేను కోరడం లేదు. కానీ జట్టులో తీసుకోమంటున్నాను.