ముంబై: భారత టీ20 జట్టులో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ కీలక నిర్ణయాలు తీసుకున్నది. సొంతగడ్డపై టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించిన సూర్యకుమార్యాదవ్పై వేటు పడింది. సూర్య స్థానంలో ముంబైకే చెందిన శ్రేయాస్ అయ్యర్‌కు బోర్డు..కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. అటు దేశవాళీ, ఐపీఎల్లో తన నాయకత్వ శైలితో పాటు నిలకడగా రాణిస్తున్న అయ్యర్ వైపు సెలెక్టర్లు మొగ్గుచూపారు. శనివారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా నేతృత్వంలో భేటీ అయిన సీనియర్ సెలెక్షన్ కమిటీ రానున్న ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లతో పాటు ఆసియా గేమ్స్‌కు జట్లను ఎంపిక చేసింది. తనదైన బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలకమవుతూ వస్తున్న హైదరాబాదీ తిలక్‌వర్మను వైస్‌కెప్టెన్సీ వరించింది.
ఇక ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పరుగుల వరద పారించిన 15 ఏండ్ల బీహార్ బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ అందరూ ఊహించినట్లుగానే జాతీయ సీనియర్ జట్టులోకి పిలుపు అందింది. లీగ్‌లో అత్యధిక పరుగుల(776)తో టాప్ స్కోరర్‌గా నిలిచిన సూర్యవంశీ..సంచనాలకు కేరాఫ్‌గా నిలుస్తూ తప్పకుండా ఎంపిక చేయాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు. మరోవైపు ఐపీఎల్లో ఆయా ఫ్రాంచైజీల తరఫున రాణించిన తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్కుమార్రెడ్డితో పాటు ప్రిన్స్యాదవ్కు జట్టులో చోటు దక్కింది. రానున్న సుదీర్ఘ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుంటూ స్టార్స్పీడ్స్టర్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్‌పాండ్యాకు విశ్రాంతినిచ్చిన సెలెక్టర్లు..ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యులైన కుల్దీప్యాదవ్తో పాటు రింకూసింగ్‌ను తప్పించారు. ఆసియాగేమ్స్‌లో బుమ్రా బరిలోకి దిగనున్నాడు.
వైభవ్ వచ్చేశాడు:
క్రికెట్ బుల్డోజర్ వైభవ్ సూర్యవంశీ జాతీయ సీనియర్ జట్టులో వచ్చేశాడు. దేశవాళీతో పాటు అండర్-16, అండర్-19, ఐపీఎల్లో ఇరుగదీస్తున్న ఈ 15 ఏండ్ల కుర్రాడి ప్రతిభకు ప్రపంచ క్రికెట్ ఫిదా అయిపోయింది. ప్రపంచ స్థాయి బౌలర్లను గల్లీబౌలర్లుగా మారుస్తూ సూర్యవంశీ ఐపీఎల్లో సృష్టించిన విధ్వంసం మాటలకందనిది. నీళ్లు తాగినంత సులువుగా ఫోర్లు, సిక్స్‌లతో చెలరేగడంలో సూర్యవంశీ ఆరితేరాడు. ఈ నేపథ్యంలో రానున్న ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు ఎంపికయ్యాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్(16 ఏండ్లు 205 రోజలు) కంటే పిన్న వయసులోనే సూర్యవంశీ(15 ఏండ్ల 71 రోజలు) జాతీయ జట్టుకు ఎంపిక కావడం విశేషం. ఇదిలా ఉంటే ఈనెల 26, 28 తేదీల్లో టీమ్ఇండియా..ఐర్లాండ్‌తో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుండగా, జూలై 1 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ మొదలుకానున్నది.
సూర్యపై వేటు..అయ్యర్‌కు చోటు:
ఊహించినట్లుగానే సూర్యకుమార్ కెప్టెన్సీపై వేటు పడింది. స్వదేశం వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ తిరిగి నిలబెట్టుకోవడంలో సూర్య కీలకమయ్యాడు. అయితే రానున్న ఆసియాగేమ్స్, లాస్ఎంజిల్స్ ఒలింపిక్స్, టీ20 ప్రపంచకప్(2028) దృష్ట్యా 35 ఏండ్ల సూర్యపై సెలెక్టర్లు నమ్మకం ఉంచలేకపోయారు. ప్రపంచకప్‌లో సూర్యకుమార్ 136.72 ైస్ట్రెక్‌రేట్‌తో 242 పరుగులు చేయగా, ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లోనూ ముంబై తరఫున 270 పరగులతో నిరాశపరిచాడు. అదే సమయంలో అయ్యర్ అటు కెప్టెన్సీతో పాటు నిలకడగా పరుగులు సాధిస్తూ సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2024లో కోల్‌కతాకు కెప్టెన్‌గా టైటిల్ అందించిన అయ్యర్..2025లో పంజాబ్‌ను రన్నరప్‌గా నిలిపాడు.
టీ20 సిరీస్‌లకు జట్టు:
అయ్యర్(కెప్టెన్), అభిషేక్, సంజు శాంసన్, కిషన్, దూబే, తిలక్‌వర్మ (వైస్ కెప్టెన్), నితీశ్‌కుమార్, అక్షర్ పటేల్, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, సిరాజ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్‌సింగ్, ప్రిన్స్‌యాదవ్, సూర్యవంశీ.
శ్రీలంకలో జరిగే రెండు నాలుగు రోజుల సిరీస్ కోసం బీసీసీఐ మరో జట్టును ఎంపిక చేసింది. లంకలో టీమ్ఇండియా టెస్టు సిరీస్ దృష్ట్యా ముందస్తుగా..యువ జట్టును సన్నాహక సిరీస్‌లో ఆడిస్తున్నారు.
జట్టు: జురెల్(కెప్టెన్), సుదర్శన్, ఆయూశ్పాండే, పడిక్కల్, గైక్వాడ్, హర్ష్‌దూబే, సారాంశ్ జైన్, గుర్నుర్ బ్రార్, అకిబ్ నబీ, యశ్ ఠాకూర్, కంబోజ్, జగదీశన్, అన్సారీ, అమన్ మొకడే, షేక్ రషీద్