Paris Olympics 2024 : ఒలింపిక్స్ తొమ్మిదో రోజు భారత షూటర్లు నిరాశపరిచారు. మను భాకర్ (Manu Bhaker) స్ఫూర్తితో పతకాలు కొల్లగొడతారనుకుంటే గురి పెట్టలేక వెనుదిరిగారు. ఆదివారం జరిగిన 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో విజయ్‌వీర్ సిద్దూ (Vijayveer Sidhu), అనిష్ భన్వల (Anish Bhanwala)లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.
మహిళల స్కీట్ విభాగంలో మహేశ్వరి చౌహన్ (Maheshwari Chauhan), రైజా ధిల్లాన్ (Raiza Dhillan)లు సైతం పేలవ ప్రదర్శన కనబరిచారు. ఆదివారం నిర్వహించిన 25 మీటర్ల ర్యాపిడ్ పిస్టల్ పోటీల్లో విజయ్‌వీర్ 9వ స్థానంలో నిలవగా, అనిష్ 12వ స్థానంతో సరిపెట్టుకున్నాడు.
విశ్వ క్రీడల్లో పతకం వేటలో 22 ఏండ్ల విజయ్‌వీర్ తృటిలో ఫైనల్ చాన్స్ మిస్ అయ్యాడు. 583-26 పాయింట్లు సాధించి 9వ స్థానానికి పరిమితయ్యాడు. ఇక ఎన్నో అంచనాలతో ఒలింపిక్స్‌కు వచ్చిన అనిష్‌కు భంగపాటు తప్పలేదు. తొలి దశ తర్వాత ఏడో స్థానంలో నిలిచిన అనిష్.. రెండో దశలో 93 పాయింట్లు సాధించి.. చివరకు 13వ స్థానంతో ఉసూరుమనిపించాడు. ఆసియా క్రీడల్లో కాంస్యంతో మెరిసిన మహేశ్వరి 14వ ర్యాంక్‌కే పరిమితమైంది. ధిల్లాన్ అయితే ఏకంగా 23వ ర్యాంక్‌తో తీవ్రంగా నిరాశపరిచింది.