Shoaib Malik : పాకిస్థాన్ మాజీ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్ (Shoaib Malik) ఫ్రాంచైజీ క్రికెట్లో దంచేస్తున్నాడు. తనకు మళ్లీ పాక్ జెర్సీ వేసుకోని మాలిక్ దేశం తరఫున ఆడాలనే ఉద్దేశమే లేదని ఇప్పటికే చెప్పేశాడు. అతడు జాతీయ జట్టులో చోటు కోల్పోయి మూడేండ్లు అవుతోంది. అయితే.. తనకు పాక్ క్రికెట్ బోర్డు(Pakistan Cricket Board) సెలెక్టర్‌గా ఆఫర్ వచ్చిందని, కానీ, తానే సున్నితంగా తిరస్కరించానని మాలిక్ వెల్లడించాడు. ఎందుకో తెలుసా..?
‘టీ20 వరల్డ్ కప్ ముందు సెలెక్టర్‌గా ఉంటారా? అని నాకు పీసీబీ నుంచి ఫోన్ వచ్చింది. అయితే.. నేను ఉండనని చెప్పేశాను. అందుకు బలమైన కారణమే ఉంది. నేను ఇంకా క్రికెట్ ఆడుతున్నాను. అలాంటప్పుడు నాతో ఆడేవాళ్లను నేను ఎలా జాతీయ జట్టుకు ఎంపిక చేయగలను’ అని మాలిక్ తెలిపాడు.
పాకిస్థాన్ గొప్ప ఆల్రౌండర్లలో ఒకడైమన మాలిక్.. టీమిండియా పాలిట కొరకరాని కొయ్యగా పేరొందాడు. తన సుదీర్ఘ కెరీర్లో అతడు ఎన్నో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇప్పటవరకూ మాలిక్ 35 టెస్టులు, 287 వన్డేలు, 124 టీ20లు ఆడాడు. 2021 నుంచి జాతీయ జట్టులో చోటు కోల్పోయిన మాలిక్ పాకిస్థాన్ సూపర్ లీగ్(PSL), బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(BPL), ఇతర ఇంటర్నేషనల్ లీగ్స్‌లో ఆడుతున్నాడు.
లేటు వయసులోనూ ఆటతో అదరగొడుతున్న మాలిక్ ఈ మధ్యే మూడో పెండ్లితో వార్తల్లో నిలిచాడు. భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మిర్జా(Sania Mirza)తో పదేండ్ల బంధాన్ని ముగించాడు. సానియా నుంచి విడాకులు తీసుకున్న మాలిక్.. పాక్‌కు చెందిన సనా జావేద్(Sana Javed) అనే టీవీ నటిని పెండ్లాడాడు.