ఇంఫాల్: మణిపూర్‌కు చెందిన కుకీ-జో కమ్యూనిటీ సభ్యులు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. (Massive rally in Manipur) సీఎం ఎన్ బీరెన్ సింగ్ మాట్లాడినట్లుగా ఆరోపించిన వివాదస్పద వైరల్ ఆడియో క్లిప్‌లకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. అలాగే తమకు ప్రత్యేక పరిపాలన కావాలని మరోసారి డిమాండ్ చేశారు. కుకీల ఆధిపత్యం ఉన్న చురచంద్‌పూర్, కాంగ్పోక్పి జిల్లాల్లో భారీ బహిరంగ ర్యాలీలు నిర్వహించారు. తమపై జరుగుతున్న దాడులు, మారణహోమాన్ని జాతి ప్రక్షాళనగా ఆరోపించారు. రాష్ట్రంలో కొనసాగుతున్న జాతుల ఘర్షణకు సంబంధించి సీఎం ఎన్ బీరెన్ సింగ్ అభ్యంతరకర వ్యాఖ్యల వైరల్ ఆడియో క్లిప్‌పై నిరసన తెలిపారు. అయితే అది ఫేక్ ఆడియో క్లిప్ అని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపించింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, జోమీ స్టూడెంట్స్ ఫెడరేషన్, కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌తో సహా స్థానిక విద్యార్థి సంఘాలు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా స్కూల్స్, మార్కెట్లను మూసివేశారు. మరోవైపు మణిపూర్ బీజేపీ అధికార ప్రతినిధి, థాడౌ తెగ నాయకుడు టీ మైఖేల్ లామ్జాతంగ్ హౌకిప్ ఇంటిని కొందరు వ్యక్తులు ధ్వంసం చేయడంతోపాటు నిప్పుపెట్టారు. కుకీ ఆధిపత్యం ఉన్న చురచంద్‌పూర్ జిల్లాలో శనివారం ఈ సంఘటన జరిగింది. 2023 మే నుంచి మణిపూర్‌లో మైతీ, కుకీ జాతుల మధ్య హింస ప్రారంభమైన తర్వాత ఆయన ఇంటిపై దాడి జరుగడం ఇది మూడోసారి.