Shoaib Akhtar | వన్డే ప్రపంచకప్-2023 కౌంట్‌డౌన్ మొదలైంది. ఐసీసీ మెగాటోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనున్నది. టైటిల్ పేవరెట్లుగా జట్లు బరిలోకి దిగబోతున్నాయి. ఈ క్రమంలో పాక్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫైనల్ మ్యాచ్ భారత్ – పాక్ మధ్య జరుగుతుందని చెప్పాడు. అదే జరిగితే 2011లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలని బాబర్ ఆజం నేతృత్వంలోని పాక్ జట్టుకు విజ్ఞప్తి చేశాడు. భారత్ వేదికగా 2011 ప్రపంచకప్ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్లో శ్రీలంక జట్టును మట్టికరిపించి టీమిండియా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది.
అంతకు ముందు సెమీ ఫైనల్లో టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో అక్తర్ మాట్లాడుతూ.. ‘2023 వన్డే ప్రపంచకప్‌లో నాకు భారత్ – పాక్ ఫైనల్ మ్యాచ్ కావాలి. మ్యాచ్ ముంబయి, అహ్మదాబాద్‌లో ఎక్కడ జరుగుతుందన్నది అవసరం లేదు. ఈ సారి 2011లో జరిగిన దానికి ప్రతీకారం తీర్చుకోవాలి’ అన్నాడు. ఈ సందర్భంగా ఆసియాకప్ వివాదంపై సైతం స్పందించాడు. ఆసియా కప్ కోసం భారతజట్టును పాక్‌కు పంపేందుకు బీసీసీఐ సిద్ధం లేదు.
ఈ సారి ఆతిథ్య హక్కులు పీసీబీకి ఉండడంతో స్వదేశంలోనే టోర్నీని నిర్వహించాలని భావిస్తున్నారు. దీనిపై అక్తర్ మాట్లాడుతూ ‘దీనిపై పెద్దగా శ్రద్ధ వహించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డాడు. ‘ఇది అర్థంలేని విషయం. ఇందులో బీసీసీఐ కానీ, పీసీబీ కానీ ఏం చేయలేవు. భారత ప్రభుత్వాన్ని అడగకుండా బీసీసీఐ ఏం చేయలేదు. పీసీబీ కూడా మా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఏం చేయదు. భారత్ – పాక్ మ్యాచ్ విషయంలో అందరూ తమ అభిప్రాయాన్ని తెలుపతారు. నేను ఇరువైపుల మాజీ ఆటగాళ్లందరినీ అభ్యర్థిస్తున్నా. దయచేసి అనవసరమైన వ్యాఖ్యలు చేయడం మానుకోండి. మోదీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పాక్‌లో ఆడేందుకు బీసీసీఐ అంగీకరిస్తుంది’ అన్నాడు.