Mohammad Shami : ఈ ఏడాది నవంబర్‌లో జరుగబోయే బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో హ్యాట్రిక్‌పై కన్నేసిన భారత సీనియర్ పురుషుల జట్టుకు గుడ్ న్యూస్. కొన్ని నెలలుగా ఆటకు దూరమైన స్పీడ్‌స్టర్ మహమ్మద్ షమీ (Mohammad Shami) పునరాగమనం చేయబోతున్నాడు. మోకాలి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకున్న షమీ రంజీ ట్రోఫీలో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ సీజన్ 202-25లో షమీ బెంగాల్ జట్టు తరఫున ఆడుతాడని శుక్రవారం ఆ రాష్ట్ర కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా (Laxmi Ratan Shukla) స్పష్టత ఇచ్చాడు.
‘రంజీల్లో షమీ బెంగాల్ తరఫున ఆడనున్నాడు. అయితే.. అతడు కేరళతో మ్యాచ్‌కు అందుబాటులో లేడు. కానీ, అతడు త్వరలోనే జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. కర్నాటక, మధ్యప్రదేశ్‌లతో కీలక మ్యాచ్‌ల సమయానికి షమీ జట్టులో ఉండే అవకాశముంది’ అని లక్ష్మీ రతన్ వెల్లడించాడు. అంతేకాదు భారత జట్టులో షమీ కీలకమైన బౌలర్ అని చెప్పిన రతన్ ఇంకా ఏం అన్నాడంటే.. ‘షమీ మంచి బౌలర్. ఆస్ట్రేలియా పర్యటనలో అతడి సేవలు జట్టుకు చాలా అవసరం. ఆసీస్ సిరీస్‌కు ముందు కనీసం రెండు రంజీ మ్యాచ్‌లు ఆడుతానని షమీ ఇప్పటికే చెప్పాడు కూడా.
లక్ష్మీ రతన్ శుక్లా, షమీ
రంజీల్లో అతడు అద్భుతంగా రాణిస్తే.. కంగారు గడ్డపై టీమిండియాకు అస్త్రం అవుతాడు’ అని చెప్పుకొచ్చాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో కోలుకున్న షమీ ఈమధ్య నెట్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. తనకు మోకాలి నొప్పి పూర్తిగా తగ్గిపోయిందని, ప్రతిష్ఠాత్మక బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్టు తెలిపాడు. ఇక షమీ నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే.
ఆస్ట్రేలియా పర్యటన అంటే అమ్మో అనుకొనే టీమిండియా ఈసారి కొండంత ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇప్పటికే వరుసగా రెండు పర్యాయాలు చిరస్మరణీయ విజయాలతో చరిత్ర సృష్టించిన భారత జట్టు నవంబర్‌లో మళ్లీ అక్కడికి వెళ్లనుంది. ఇప్పటికే 2018-19, 2020-21లో విజేతగా నిలిచిన టీమిండియా ఈసారి కూడా విజయంపై ధీమాతో ఉంది.
పెర్త్ స్టేడియం వేదికగా 22వ తేదీన ఇరుజట్ల మధ్య తొలి టెస్టు జరుగనుంది. 1992 తర్వాత తొలిసారి ఈ సిరీస్‌ను ఐదు మ్యాచ్‌లుగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచంలోని మేటి జట్లు అయిన భారత్, ఆస్ట్రేలియాలు మైదానంలోకి దిగితే హోరాహోరీ తప్పదు.