IndusInd Bank | ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఇండస్ఇండ్ బ్యాంకు షేర్లు శుక్రవారం 19 శాతం పతనం అయ్యాయి. దీంతో శుక్రవారం ఒక్క రోజే సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,489.39 కోట్లు కోల్పోయింది. 2023-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాల్లో ఇండస్ఇండ్ బ్యాంకు మార్కెట్ వర్గాలను నిరాశ పరిచింది. గతేడాదితో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సర ద్వితీయ త్రైమాసికంలో నికర లాభం 40 శాతం తగ్గుముఖం పట్టి రూ.1,331 కోట్లకు పరిమితమైంది.
దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. ఫలితంగా ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ అమ్మకాల ఒత్తిడికి గురైంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ బీఎస్ఈలో 19.82 శాతం నష్టంతో రూ.1,037లకు పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్లో స్టాక్ 19.88 శాతం నష్టంతో రూ.1,025.50లతో 52 వారాల కనిష్టాన్ని తాకింది. దీంతో ఇండస్ఇండ్ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.18,489.39 కోట్లు నష్టపోయి రూ.81,136.03 కోట్లతో సరిపెట్టుకున్నది.