ఇండోర్, అక్టోబర్ 28: శక్తి పంప్స్(ఇండియా) లిమిటెడ్(ఎస్‌పీఐఎల్) అంచనాలకు మించి రాణించింది. సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలానికిగా సంస్థ రూ.101.4 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.6 కోట్ల లాభంతో పోలిస్తే ఎన్నో రెట్ల వృద్ధిని కనబరిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ.152.8 కోట్లుగా ఉన్న కంపెనీ ఆదాయం ఈసారికిగాను నాలుగు రెట్లు ఎగబాకి రూ.634.6 కోట్లకు చేరుకున్నది.
గత త్రైమాసికానికిగాను రూ.1,800 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని ఎస్‌పీఐఎల్ చైర్మన్ దినేశ్ పటిదర్ తెలిపారు. మరోవైపు కంపెనీ 5:1 రేషియోలో బోనస్ షేరును షేరు హోల్డర్లకు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలానికిగాను రూ.1,202 కోట్ల ఆదాయంపై రూ.194.10 కోట్ల లాభాన్ని గడించింది. ప్రస్తుతం సంస్థ సోలార్ పంపులు, ఎనర్జీ-ఎఫిసెంటర్ స్టేయిన్‌లెస్-స్టీల్ సబ్మెర్షిబుల్ పంపులు, ప్రెషర్ బూస్టర్ పంపులు, పంప్-మోటర్, ఇతర ఉత్పత్తులను తయారు చేస్తున్నది. కంపెనీకి ఉన్న రెండు ప్లాంట్లలో ప్రతియేటా 5 లక్షల పంపులు, మోటార్లు తయారుచేస్తున్నది.