Para Atheletics : పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత స్టార్లు పతకాల వేట మొదలెట్టారు. హైజంపర్ శైలేష్ కుమార్ (Shailesh Kumar) దేశానికి తొలి స్వర్ణం అందించాడు. ఇదే విభాగంలో పోటీ పడిన వరుణ్ సింగ్ భాటి (Varun Singh Bhati) కాంస్యంతో మెరిశాడు. అయితే.. రాహుల్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఒలింపిక్ విజేత ఎజ్రా ఫ్రెచ్(అమెరికా) రెండో స్థానంలో నిలిచి వెండి పతకం సాధించాడు.
ఢిల్లీ వేదికగా జరుగుతున్న పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పన్నెండో సీజన్లో శైలేష్ అదరగొట్టాడు. టీ 42 విభాగంలో అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన కనబరుస్తూ 1.91 మీటర్ల ఎత్తు దూకాడు. దాంతో, పసిడి పతకం కొల్లగొట్టడమే కాకుండా ఆసియా రికార్డును బ్రేక్ చేశాడీ 25 ఏళ్ల అథ్లెట్. వరుణ్ సింగ్ భాటీ తొలి ప్రయత్నంలో ఫ్రెచ్కు పోటీగా 1.85 మీటర్ల ఎత్తు దుమికినా.. రెండో ప్రయత్నంలో మాత్రం విఫలమయ్యాడు. ఇక, ఆర్చరీలో శీతల్ దేవీ (Sheetal Devi) సంచలన ప్రదర్శనతో స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. ఆద్యంతం హోరాహోరీగా సాగిన ఫైనల్లో టర్కీకి చెందిన ఒజ్నూర్ కురే గుర్డీను 146-143తో ఓడించింది శీతల్.
Proud of you Champ ! 🇮🇳
Heartiest congratulations to Shailesh Kumar for winning Gold in Men’s High Jump T63/42 category at #WPAC2025. pic.twitter.com/zv4ypgiV6l
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 27, 2025
జవహర్లాన్ నెహ్రూ స్టేడియంలో సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకూ ఈ మెగా టోర్నీ జరుగనుంది. మొత్తంగా వంద దేశాల నుంచి 1000 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. స్ప్రింట్స్, మారథాన్, జంప్స్, జావెలిన్ త్రో.. వంటి ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు.