హైదరాబాద్, ఆట ప్రతినిధి: అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ…భారత పర్యటనకు భారీ స్థాయిలో రంగం సిద్ధమైంది. జీవోఏటీ టూర్లో భాగంగా ఈనెల 13న మెస్సీ తొలుత కోల్‌కతాకు రానున్నాడు. మెస్సీకి ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని దేశంలో కోల్‌కతాతో పాటు దక్షిణాన హైదరాబాద్, పశ్చిమాన ముంబై, ఉత్తరాన ఢిల్లీలో పర్యటన ఖరారైంది. మొదట కోల్‌కతా పర్యటనలో మెస్సీ తన పేరిట ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని వర్చువల్‌గా ఆవిష్కరించనున్నాడు. ఆ తర్వాత యువ భారతి ఫుట్‌బాల్ స్టేడియంలో పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్‌ఖాన్, క్రికెట్ దిగ్గజం సౌరవ్ గంగూలీతో కలిసి మెస్సీ ఫ్రెండ్లీ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడనున్నాడు.
ఆ తర్వాత సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఈ స్టాకర్ స్టార్ రాత్రి 7 గంటలకు ఉప్పల్ రాజీవ్‌గాంధీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడుతాడు. ఫలక్‌నుమాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపిక చేసిన అతిథులతో కలిసి మెస్సీ గడపనున్నాడు. ఈనెల 14న ముంబైలో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియంలో పాడెల్ కప్, సెలెబ్రిటీలతో కలిసి సాకర్ మ్యాచ్, వాంఖడే స్టేడియంలో చారిటీ ఫ్యాషన్ షోలో మెస్సీ అభిమానులను అలరించనున్నాడు.
ముంబై నుంచి 15న ఢిల్లీకి చేరుకోనున్న మెస్సీ..ప్రధాని నరేంద్రమోదీతో భేటీ కానున్నాడు. సాయంత్రం అరుణ్‌జైట్లీ స్టేడియంలో మినర్వా అకాడమీ ప్లేయర్ల సన్మానంలో పాల్గొననున్నాడు. మెస్సీ భారత పర్యటనను కోల్‌కతాకు చెందిన శతద్రు దత్తా ప్రధాన ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో జరిగే ఈవెంట్ కోసం ఇప్పటికే టికెట్లను డిస్ట్రిక్(జొమాటో) యాప్‌లో కొనుగోలుకు ఉంచారు. రూ 2వేల నుంచి మొదలుకుని 30 వేలుగా టికెట్ల ధరలు నిర్ణయించారు.
హైదరాబాద్ పర్యటనలో భాగంగా మెస్సీ సాకర్ ఫ్యాన్స్‌ను అలరించనున్నాడు. మెస్సీతో ప్రత్యేకంగా ఫొటో దిగాలనుకునే వారు రూ.10లక్షలు చెల్లించి అవకాశాన్ని సొంతం చేసుకోవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందుకోసం 100 ప్రత్యేకమైన స్లాట్లను ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే సాకర్ మ్యాచ్‌లో సహచర ప్లేయర్లు రోడ్రిగో డీ పాల్, లుయిస్ సురెజ్‌తో కలిసి మెస్సీ బరిలో దిగనున్నాడు. 20నిమిషాలు జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో సింగరేణి ఆర్ఆర్-9 టీమ్, మెస్సీ ఆల్‌స్టార్స్ తలపడనున్నాయి. షూటౌట్ సెగ్మెంట్లో పిల్లలకు మెస్సీ మెళకువలు నేర్పించనున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మ్యూజికల్ కన్సర్ట్ ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. రాత్రికి హైదరాబాద్‌లో బస చేసే మెస్సీ..ఆదివారం ముంబైకి బయల్దేరి వెళ్లనున్నాడు.