హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ పరీక్షలు 2026 మే మొదటి వారంలో నిర్వహించాలని ఉన్నత విద్యామండలి భావిస్తున్నది. మే 4, 5 తేదీలను మండలి అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రాథమికంగా ఇప్పటికే ఒక షెడ్యూల్ రూపొందించారు. ఆ షెడ్యూల్‌ను ప్రభుత్వ ఆమోదం కోసం పంపించనున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ఇదే షెడ్యూల్ విడుదల చేస్తారు. ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరుగనున్నాయి. జేఈఈ మెయిన్-2 పరీక్షలు ఏప్రిల్ 2 నుంచి 9 వరకు జరుగుతాయి. మే మొదటి వారంలో ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించడం ఉత్తమమని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఫిబ్రవరిలో ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల చేసి, మార్చి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నారు.
ఎప్‌సెట్‌తోపాటు మిగతా ప్రవేశ పరీక్షలను మేలోనే నిర్వహించాలని ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఎడ్‌సెట్, లాసెట్, ఐసెట్, పీజీఈసెట్, ఈసెట్, పీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షలు అన్నింటిని మేలోనే పూర్తి చేయాలన్న సంకల్పంతో మండలి అధికారులు ఉన్నారు. ఫిబ్రవరిలో ఈ ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదల చేస్తామని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి. కొన్ని ఎంట్రెన్స్ టెస్ట్‌ల నిర్వహణ బాధ్యతలను మార్చే అవకాశం కనిపిస్తున్నది.
ఎప్‌సెట్‌ను ఈసారి కూడా జేఎన్టీయూకే అప్పగించనున్నారు. ఇది మినహా మిగతా సెట్స్ నిర్వహణ బాధ్యతలను ఒక వర్సిటీ నుంచి మరో వర్సిటీకి మార్చే అవకాశం ఉన్నది. ఎప్‌సెట్‌తోపాటు మిగతా ప్రవేశ పరీక్షల షెడ్యూల్స్‌ను వారంలో ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతోపాటు ఈ ప్రవేశ పరీక్షలను నిర్వహించే వర్సిటీలు, సెట్ల కన్వీనర్లను సైతం వారం రోజుల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.