విశాఖపట్నం : స్వదేశంలో వన్డే ప్రపంచకప్ గెలిచిన జోరుమీదున్న భారత మహిళా క్రికెట్ జట్టు.. టీ20ల్లోనూ అదరగొడుతున్నది. విశాఖపట్నం వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 7 వికెట్ల తేడాతో గెలిచి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0తో ముందంజ వేసింది. లంక నిర్దేశించిన 129 పరుగుల ఛేదనను ఉమెన్ ఇన్ బ్లూ.. 11.5 ఓవర్లలోనే దంచేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ షెఫాలీ వర్మ (34 బంతుల్లో 69 నాటౌట్, 11 ఫోర్లు, 1 సిక్స్) మెరుపు అర్ధశతకంతో అదరగొట్టగా జెమీమా రోడ్రిగ్స్ (15 బంతుల్లో 26, 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. అంతకుముందు లంక మిడిలార్డర్ వైఫల్యంతో 128 రన్స్‌కే పరిమితమైంది. హర్షిత సమరవిక్రమ (33) టాప్ స్కోరర్. భారత యువ స్పిన్నర్లు శ్రీచరణి (2/23), వైష్ణవి శర్మ (2/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు. ఇరుజట్ల మధ్య ఈనెల 26న జరుగబోయే మూడో టీ20కి తిరువనంతపురం ఆతిథ్యమివ్వనుంది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. క్రాంతి గౌడ్ మొదటి ఓవర్లో విష్మి గుణరత్నె (1).. ఆమెకే క్యాచ్ ఇచ్చింది. ఆ తర్వాత కెప్టెన్ చమారి, హాసిని (22) కొద్దిసేపు క్రీజులో నిలబడ్డారు.6వ ఓవర్లో స్నేహ్ రాణా.. చమారిని ఔట్ చేసి ఈ జోడీని విడదీసినా హాసినికి జతకలిసిన హర్షిత నిలకడగా ఆడింది. ఈ జోడీ కుదురుకుంటున్న తరుణంలోనే 13వ ఓవర్లో చరణి.. హాసినిని ఔట్ చేసి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత లంక బ్యాటర్లు క్రీజులోకి వచ్చినంత వేగంగానే పెవిలియన్‌కు వెళ్లారు.
స్వల్ప ఛేదనలో ఓపెనర్ షెఫాలీ దూకుడుగా ఆడింది. స్మృతి (14) త్వరగానే నిష్క్రమించినా ఆరంభం నుంచే బౌండరీలతో రెచ్చిపోయిన షెఫాలీకి జెమీమా జతకలవడంతో స్కోరుబోర్డు పరుగులు పెట్టింది. రణవీర 5వ ఓవర్లో 3 బౌండరీలతో 16 రన్స్ రాబట్టిన ఆమె.. చమారీ 6వ ఓవర్లో 4, 6, 4 బాదింది. జెమీమా సైతం 7వ ఓవర్లో 4, 6, 4తో 15 రన్స్ పిండుకుంది. కానీ కావ్య వేసిన మరుసటి ఓవర్లో ఆమె ఔట్ అయినా అప్పటికే భారత విజయం ఖరారైంది. జెమీమా, షెఫాలీ రెండో వికెట్‌కు 58 రన్స్ జోడించారు. జెమీమా, హర్మన్‌ప్రీత్ పెవిలియన్ చేరినా షెఫాలీ విజయలాంఛనాన్ని పూర్తిచేసింది.
శ్రీలంక: 20 ఓవర్లలో 128/9 (హర్షిత 33, ఆటపట్టు 31, చరణి 2/32, వైష్ణవి 2/32);
భారత్: 11.5 ఓవర్లలో 129/3 (షెఫాలీ 69*, 26, కవిష 1/15, మల్కి 1/22)