T20 World cup | ఆస్ట్రేలియా వేదికగా జరుగుతునన టీ20 వరల్డ్ కప్ పోటీలు సంచలనం నమోదుతో ప్రారంభయ్యాయి. క్రికెట్లో ఏదైనా సాధ్యమే అని చెప్పడానికి తొలి పోటీనే ఉదాహరణగా నిలిచింది. ప్రపంచ కప్ తొలి పోటీలో శ్రీలంక, నమీబియా జట్లు పోటీపడగా.. నమీబియా జట్టు సంచలనం నమోదు చేసింది. అంచనాలకు దరిదాపుల్లో కూడా లేని నమీబియా జట్టు.. సమష్టిగా రాణించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నది.
వరల్డ్ కప్ టీ20 తొలి మ్యాచ్‌లో పసికూన నమీబియా సంచలనం విజయంతో ప్రారంభించింది. నిర్ణీత 20 ఓవర్లలో 163 పరుగులు చేసిన నమీబియా జట్టు.. శ్రీలంక జట్టుపై 55 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా జట్టు 163 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు కేవలం 108 పరుగులకే కుప్పకూలింది. నమీబియా బౌలర్లలో బెర్నార్డ్ స్కోల్ట్జ్, బెన్ షికోంగో, జాన్ ఫ్రైలింక్, వైస్ తలో 2 వికెట్లు తీసి శ్రీలంక పతనాన్ని శాసించారు. ఇటీవల ఆసియా కప్ గెలిచిన శ్రీలంక జట్టు. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో నమీబియా చేతిలో ఓడిపోవడం విశేషం.
తొలుత బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. 14.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసి నమీబియా పీకల్లోతు కష్టాల్లో పడింది. జాన్ ఫ్రైలింక్ (44 ; 4×4), జేజే స్మిత్ (31 నాటౌట్; 2×4, 2×6) ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 70 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం మ్యాచ్ విన్నింగ్ కావడానికి దోహదపడ్డాయి. శ్రీలంక తరఫున ప్రమోద్ మదుషన్ లియానగమగే (2/37), మహేశ్ తీక్షణ (1/23), దుష్మంత చమీర (1/39), చమిక కరుణరత్నే (1/36), వనిందు హసరంగా బీ సిల్వా (1/27) చెలరేగిపోయారు.
నమీబియా ఇచ్చిన లక్ష్యాన్ని ఛేదించేందుకు బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక.. పవర్‌ప్లే లోపల 3 వికెట్లు కోల్పోవడంతో నియంత్రణ కోల్పోయింది. 3.3 ఓవర్లలో పాతుమ్ నిస్సాంక (9), కుసల్ మెండిస్ (6), దనుష్క గుణతిలక (0) పెవిలియన్ ముఖం పట్టారు. భానుక రాజపక్సే (20 ; 2×4), కెప్టెన్ దసున్ షనక (27; 2×4, 1×6) రాణించారు. శ్రీలంక 19 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌట్ కావడంతో నమీబియా విజయం సాధించింది. నమీబియా తరఫున బెన్ షికోంగో (2/22), బెర్నార్డ్ స్కోల్ట్జ్ (2/18), డేవిడ్ వైస్ (2/16), జేజే స్మిత్ (1/16), జాన్ ఫ్రైలింక్ (2/26) గెలుపులో కీలకంగా ఉన్నారు.