Pro Kabaddi | హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ 11వ సీజన్లో ఆతిథ్య తెలుగు టైటాన్స్‌కు వరుసగా రెండో పరాభవం ఎదురైంది. మంగళవారం రాత్రి స్థానిక జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ 22-52తో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓడింది. జైపూర్ సారథి అర్జున్ దేశ్వాల్ ఏకంగా 19 పాయింట్లతో విజృంభించాడు. అతడితో పాటు అభిషేక్ (8), సుర్జీత్ (4) రాణించారు. వీళ్ల ధాటికి టైటాన్స్ నాలుగు సార్లు ఆలౌట్ అయింది. టైటాన్స్ తరఫున పవన్ సెహ్రావత్ (7), విజయ్ మాలిక్ (5) పోరాడారు. ఆట తొలి అర్ధభాగం మొదటి పది నిమిషాల్లో టైటాన్స్ ఆధిపత్యం ప్రదర్శించినా తర్వాత మ్యాచ్‌పై పట్టు కోల్పోయింది. రెండో భాగంలో జైపూర్ విజృంభణతో టైటాన్స్ డీలా పడింది.