హాంగ్జౌ: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో సాత్విక్, చిరాగ్ జోడీ జోరు కొనసాగుతున్నది. టోర్నీలో కఠినమైన ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా ఉన్న గ్రూప్-బీ రెండో మ్యాచ్‌లో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ద్వయం.. 21-11, 16-21, 21-11తో ప్రపంచ 8వ ర్యాంకు ఇండోనేషియా జోడీ ఫజర్ అల్ఫియాన్, మహ్మద్ షోహిబుల్ ఫిక్రి జోడీపై నెగ్గింది. తొలి మ్యాచ్‌లో నెగ్గిన భారత జోడీ.. రెండో పోరులోనూ గెలిచి నాకౌట్ దశకు అడుగు దూరంలో నిలిచింది.
దూకుడుగా ఆడిన తొలి గేమ్‌లో 6-0 ఆధిక్యంతో నిలిచిన ఈ ద్వయం.. అదే జోరును కొనసాగిస్తూ గేమ్‌ను గెలుచుకుంది. కానీ రెండో గేమ్‌లో ఇండోనేషియన్లు పుంజుకున్నారు. భారత షట్లర్ల తప్పిదాలను ఆసరాగా చేసుకుని వాళ్లు 8-3తో పైచేయి సాధించారు. భారత షట్లర్లు పుంజుకునే యత్నం చేసినా అల్ఫియాన్ జోడీ ఆ అవకాశమివ్వలేదు. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో భారత జంట 6-2తో పైచేయి సాధించి తమ ట్రేడ్‌మార్క్ స్మాష్‌లతో ప్రత్యర్థిపై ఆధిక్యాన్ని కొనసాగించింది. అల్ఫియాన్ జోడీ చేసిన తప్పిదాలను సద్వినియోగం చేసుకుంటూ సాత్విక్, చిరాగ్ మ్యాచ్‌ను విజయంతో ముగించారు.