సింగపూర్ : మూడు నెలల స్వల్ప విరామం తర్వాత భారత డబుల్స్ బ్యాడ్మింటన్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఆటకు పునరాగమనం చేయనున్నారు. మంగళవారం నుంచి మొదలుకాబోయే బీడబ్ల్యూఎఫ్ సింగపూర్ ఓపెన్ సూపర్ 750 టోర్నమెంట్లో ఈ ప్రపంచ మాజీ నెంబర్ వన్ జోడీ బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్స్ ఆడిన సాత్విక్-చిరాగ్ జంట.. ఆ తర్వాత పలు కారణాలతో కీలక టోర్నీలకు దూరంగా ఉంది. తొలి రౌండ్లో ఈ భారత జోడీ.. మలేషియా ద్వయం చూంగ్ హోన్-మహ్మద్ హైకల్తో తలపడనున్నారు. పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్ షట్లర్లు హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి పోటీలో ఉన్నారు.
ఇక మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు భారత బృందాన్ని నడిపించనుంది. సింధుతో పాటు అన్మోల్ ఖర్బ్, మాళవిక బన్సోద్, అనుపమ ఉపాధ్యాయ అదృష్టాన్ని పరీక్షించనుకోనున్నారు. సింగిల్స్ విభాగాల్లో భారత షట్లర్లు గత కొన్నాళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేక చతికిలపడుతుండగా సింగపూర్ ఓపెన్‌లో వాళ్లకు కఠిన సవాల్ ఎదురుకానుంది. గత వారం మలేషియా మాస్టర్స్‌లో ఫైనల్ చేరిన కిడాంబి శ్రీకాంత్.. ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్ పెయిర్ త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్‌తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో తనీషా క్రాస్టో-ధ్రువ్ కపిల బరిలో ఉన్నారు.