జకార్త: స్వల్ప విరామం తర్వాత ఇటీవలే ముగిసిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీతో పునరాగమనం చేసిన భారత డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ఇండోనేషియా ఓపెన్‌లో సత్తా చాటుతున్నారు. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో ఈ మాజీ ప్రపంచ నంబర్‌వన్ జోడీ 16-21, 21-18, 22-20తో ప్రపంచ 16వ ర్యాంకు ద్వయం రస్మస్-ఫ్రెడరిక్ (డెన్మార్క్)పై పోరాడి గెలిచింది. గంటా పది నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో విజయం కోసం రెండు జోడీలు నువ్వానేనా అన్నట్టుగా తలపడ్డా ఒత్తిడిలోనూ పరిణితితో ఆడిన భారత ద్వయం క్వార్టర్స్ చేరింది.
క్వార్టర్స్‌లో వీళ్లు మలేషియాకు చెందిన ఏడో సీడ్ వీ చోంగ్-కై వున్తో తలపడనున్నారు. ఈ టోర్నీలో ఇక భారత ఆశలు కూడా వీరిపైనే ఉన్నాయి. మిగిలిన విభాగాల్లో బరిలో నిలిచిన షట్లర్లంతా ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు 22-20, 10-21, 18-21తో చోచువాంగ్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడింది. మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ, మిక్స్డ్ డబుల్స్‌లో సతీశ్-ఆద్య సైతం ప్రత్యర్థుల చేతిలో చిత్తయ్యారు.