సింగపూర్ : సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ జోడీ సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో సాత్విక్, చిరాగ్ ద్వయం 19-21, 21-16, 21-19తో ఏడోసీడ్ సాబర్ కర్యమన్, రెజా పాహ్లెవి(ఇండోనేషియా)పై అద్భుత విజయం సాధించింది. గంటా 14 నిమిషాల పాటు సాగిన పోరులో తొలి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్, చిరాగ్ పుంజుకుని పోటీలోకి వచ్చారు.
కండ్లు చెదిరే స్మాష్‌లకు తోడు నెట్‌గేమ్‌తో ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించిన మన జోడీ వరుస గేముల్లో మ్యాచ్‌ను కైవసం చేసుకుంది. మరో సింగిల్స్‌లో ప్రణయ్ 16-21, 14-21తో పొపోవ్(ఫ్రాన్స్) చేతిలో ఓడాడు. మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో పీవీ సింధు 9-21, 21-18, 16-21తో చెన్ యుఫీ(చైనా) చేతిలో ఓడి నిష్క్రమించింది. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ ద్వయంతో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో రోహన్కపూర్, రుత్వికా శివానీ జంట పోరాటం ముగిసింది.