సింగపూర్: సింగపూర్ ఓపెన్‌లో భారత స్టార్ ద్వయం సాత్విక్‌సాయిరాజ్, చిరాగ్‌శెట్టి పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-19, 10-21, 18-21తో మలేషియాకు చెందిన ఆరోన్ చియా, సోహ్ వుయ్ యిక్ చేతిలో ఓటమి పాలైంది. టోర్నీ ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబరిచిన సాత్విక్, చిరాగ్ సెమీస్‌లో అదే జోరు కొనసాగించలేకపోయారు. 64 నిమిషాల్లో ముగిసిన పోరులో తొలి గేమ్‌ను దక్కించుకున్న ఈ మాజీ వరల్డ్ నంబర్‌వన్ జోడీ వరుస గేములను చేజార్చుకుని ఓటమివైపు నిలిచారు. ఇటీవలే గాయం నుంచి తేరుకుని తొలిసారి బరిలోకి దిగిన సాత్విక్, చిరాగ్ జంట అంచనాలకు మించి రాణించింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ జోడీని ఓడించిన ఈ స్టార్ ద్వయం సెమీస్ గండాన్ని దాటలేకపోయింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖి పోరులో 3-9తో పోటీకి దిగిన సాత్విక్, చిరాగ్‌కు నిరాశే ఎదురైంది.