బెంగళూరు టెస్టులో ఏదైనా అద్భుతం జరిగేనా! ప్రతీ భారత అభిమాని మదిని తొలుస్తున్న ప్రశ్న ఇది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్‌సేన మలి ఇన్నింగ్స్‌లో సత్తాచాటింది. సీనియర్ల నిష్క్రమణ వేళ సర్ఫరాజ్‌ఖాన్ సూపర్ సెంచరీకి తోడు పంత్ పోరాటంతో 462 పరుగుల భారీ స్కోరు అందుకుంది. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు కివీస్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నిలిచారు. దేశవాళీ ఫామ్‌ను దిగ్విజయంగా కొనసాగిస్తూ సర్ఫరాజ్ దుమ్మురేపితే..గాయాన్ని కూడా లెక్కచేయకుండా పంత్ చేసిన పోరాటం వారెవ్వా అనిపించింది.
కివీస్ బౌలర్లను దునుమాడుతూ ఈ ఇద్దరు చిన్నస్వామి స్టేడియంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో కదంతొక్కారు. భారీ లక్ష్యం దిశగా దూసుకెళుతున్న భారత్‌ను హెన్రీ, ఒరూర్కీ మరోమారు దెబ్బతీశారు. వీరి ధాటికి భారత్ 52 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. 107 పరుగుల స్వల్ప లక్ష్యఛేదనలో కివీస్ సఫలం అవుతుందా లేక..వరుణుడి అంతరాయంతో ఆఖరి రోజు ఆట రద్దు అవుతుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. అద్భుతం జరిగితే సరిగ్గా 20 ఏండ్ల క్రితం ఆస్ట్రేలియాపై గెలిచినట్లు కివీస్‌పై చారిత్రక విజయం మన సొంతమైనట్లే.
Bengaluru Test | బెంగళూరు: సొంతగడ్డపై తమకు తిరుగులేదనుకున్న భారత్‌కు న్యూజిలాండ్ రూపంలో ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో కివీస్ బోణీ కొట్టేందుకు చేరువలో ఉంది. భారత్ నిర్దేశించిన 107 పరుగుల లక్ష్యఛేదన కోసం ఆదివారం కివీస్ బరిలోకి దిగనుంది. సరిగ్గా 36 ఏండ్ల క్రితం ముంబై వాంఖడే మైదానంలో భారత్‌పై న్యూజిలాండ్ చివరి సారి విజయం సాధించింది. ఇందులో దిగ్గజ బౌలర్ రిచర్డ్ హ్యాడ్లీ 10 వికెట్ల ప్రదర్శనతో కివీస్ విజయంలో కీలకమయ్యాడు. మళ్లీ ఇన్నేండ్లకు టీమ్ఇండియాపై గెలిచే అవకాశం వచ్చింది. ఓవర్‌నైట్ స్కోరు 231/3తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్..సర్ఫరాజ్‌ఖాన్(195 బంతుల్లో 150, 18ఫోర్లు, 3సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు రిషబ్ పంత్(105 బంతుల్లో 99, 9ఫోర్లు, 5సిక్స్‌లు) వీరోచిత పోరాటంతో 462 పరుగులు చేసింది.
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్‌తో నిరాశపరిచినా..ముంబైకర్ సర్ఫరాజ్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత శతకంతో కదంతొక్కాడు. ఓవైపు సీనియర్లు నిరాశపరిచినా..అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ భారత్‌ను పోటీలో నిలిపాడు. జడేజా బౌలింగ్‌లో గాయపడ్డ పంత్ పోరాటం ఆకట్టుకుంది. కివీస్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన పంత్ పరుగు తేడాతో సెంచరీకి దూరమయ్యాడు. వీరిద్దరు సాధికారిక ఇన్నింగ్స్‌తో కివీస్ ముందు భారత్ లక్ష్యాన్ని నిర్దేశించగల్గింది. అయితే మ్యాట్ హెన్రీ(3/102), ఒరూర్కీ(3/92) మరోమారు చెలరేగడంతో టీమ్ఇండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. రాహుల్(12), జడేజా(5), అశ్విన్(15) విఫలం కాగా, బుమ్రా(0), సిరాజ్(0) సున్నాలు చుట్టారు.
సర్ఫరాజ్, రిషబ్ పంత్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఓవైపు సీనియర్లు నిష్క్రమించినా.. ఏమాత్రం వెనుకకు తగ్గకుండా కివీస్ బౌలింగ్ దాడిని కాచుకు కూర్చున్నారు. ఆస్ట్రేలియాపై ఈడెన్‌గార్డెన్స్‌లో ద్రవిడ్, లక్ష్మణ్ ఇన్నింగ్స్‌ను వీరిద్దరు గుర్తుకు తెచ్చారు. పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును ఒడ్డుకు చేర్చుతూ పరుగులు కొల్లగొట్టారు. దేశవాళీలో దుమ్మురేపుతున్న సర్ఫరాజ్..కివీస్‌పై అదే పంథాను కొనసాగించాడు. బౌలర్ ఎవరన్నది లెక్కచేయకుండా మైదానం నలువైపులా చూడచక్కని షాట్లతో అలరించాడు. మరోవైపు గాయంతో అసలు బ్యాటింగ్‌కు వస్తాడా అన్న అనుమానాలను పటాపంచలు చేసిన పంత్ ఇన్నింగ్స్ ఆదిలో ఒకింత తడబడ్డాడు.
టెస్టు ఒక ఇన్నింగ్స్‌లో సున్నాకు ఔటై మరో ఇన్నింగ్స్‌లో 150కి పైగా పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా సర్ఫరాజ్(0, 150) నిలిచాడు. మాధవ్ ఆప్టే(0, 163*), నయన్ మోంగియా(152, 0) మిగతా ఇద్దరు బ్యాటర్లు.
ఖాన్‌తో ఓసారి రెండో పరుగు కోసం ప్రయత్నించిన పంత్..తృటిలో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇక అక్కణ్నుంచి వెనుదిరిగి చూసుకోని పంత్..కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తనదైన ట్రేడ్‌మార్క్ షాట్లతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సౌథీని లక్ష్యంగా చేసుకుంటూ పంత్ కొట్టిన భారీ సిక్స్ స్టేడియం బయటికి రాకెట్లా దూసుకెళ్లింది. మరో ఎండ్‌లో సర్ఫరాజ్..స్విచ్ షాట్లు, అప్పర్ కట్లతో అదరగొట్టాడు. ఒకానొక దశలో సర్ఫరాజ్ దూకుడు అడ్డుకునేందుకు కివీస్ కెప్టెన్ లాథమ్ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. కెరీర్లో తొలిసారి సెంచరీ మార్క్ అందుకున్న సర్ఫరాజ్..పంత్‌తో కలిసి సంబురాలు చేసుకున్నాడు. ఈ జోడీని విడగొట్టేందుకు బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించినా కివీస్‌కు లాభం లేకపోయింది.
కివీస్ కెప్టెన్ కొత్త బంతి ఎంచుకోవడం మ్యాచ్ గతిని మార్చేసింది. అప్పటి వరకు సర్ఫరాజ్, పంత్‌ను నిలువరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నించిన లాథమ్..కొత్త బంతితో అనుకున్న ఫలితాన్ని రాబట్టాడు. హెన్రీ, ఒరూర్కీ స్వింగ్‌తో భారత్ 54 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లు కోల్పోయింది. సర్ఫరాజ్ ఔట్‌తో నాలుగో వికెట్‌కు 177 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన రాహుల్, జడేజా, అశ్విన్, బుమ్రా, సిరాజ్ వెంటవెంటనే ఔట్ కావడంతో టీమ్ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఆ తర్వాత ఛేదనకు దిగిన కివీస్..వెలుతురులేమితో ఆట కొనసాగించలేకపోయింది.
భారత్ తొలి ఇన్నింగ్స్: 46 ఆలౌట్, న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402 ఆలౌట్, భారత్ రెండో ఇన్నింగ్స్: 462 ఆలౌట్, న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 0/0