ఢాకా : జట్టులో జూనియర్లను గదికి పిలిపించుకుని మరీ చెంప చెల్లుమనిపిస్తుందని తీవ్ర ఆరోపణలు ఎదుర్కుంటున్న బంగ్లాదేశ్ మహిళా క్రికెట్ జట్టు సారథి నిగర్ సుల్తానా జోటీ.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌ను ఈ వివాదంలోకి లాగి విమర్శల పాలైంది. బంగ్లా పేసర్ జహనారా ఆలమ్ చేసిన ఈ ఆరోపణలపై సుల్తానా స్పందిస్తూ.. ‘నేనెందుకు కొడతాను? నేను వికెట్లను నా బ్యాట్‌తో ఎందుకు బాదుతాను? నేనేమైనా హర్మన్‌ప్రీత్‌నా? నా వ్యక్తిగత విషయాల్లో ఏదైనా తప్పుగా అనిపిస్తే బ్యాట్‌ను తిప్పుతూ కోపాన్ని ప్రదర్శిస్తానేమో లేదంటే హెల్మెట్‌ను నేలకు కొడతానేమో గానీ ఎవరినీ కొట్టలేదు.
కావాలంటే మీరు నేను కొట్టానని చెబుతున్న ఆ ఆటగాళ్లను అడగండి’ అని చెప్పింది. కాగా 2023లో బంగ్లా పర్యటన సందర్భంగా హర్మన్‌ప్రీత్ అంపైర్ తప్పుడు నిర్ణయంతో అసహనానికి గురై స్టంప్స్‌ను బ్యాట్‌తో కొట్టడం అప్పట్లో వివాదాస్పదమైంది. అయితే ఇప్పుడు సందర్భం కాకపోయినా సుల్తానా.. హర్మన్‌ప్రీత్ పేరును ప్రస్తావించడంపై భారత అభిమానులు ఆమెపై మండిపడుతున్నారు.