Sanju Samson : అంతర్జాతీయ టీ20ల్లో భారత ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson) చరిత్ర సృష్టించాడు. వరుసగా రెండో సెంచరీతో రికార్డు నెలకొల్పాడు. డర్బన్ మైదానంలో సఫారీలను ఉతికేసిన శాంసన్ విధ్వంసక శతకం నమోదు చేశాడు. సొంతమైదానంలో ఆడినట్టే చెలరేగిన అతడు 47 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్లతో శతకం బాదేశాడు. దాంతో, భారత జట్టు నుంచి ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా అతడు రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్ బౌలర్లను వణికిస్తూ మెరుపు సెంచరీ బాదిన సంజూ శాంసన్ ఇప్పుడు దక్షిణాఫ్రికా గడ్డపై కూడా తన బ్యాట్ పవర్ చూపించాడు. పీటర్ బౌలింగ్లో వరుసగా రెండు సిక్సర్లు బాది 27 బంతుల్లోనే ఈయాభైకి చేరువైన అతడు.. ఆ తర్వాత కేవలం 20 బంతుల్లోనే మరో యాభై కొట్టేశాడు.
కేశవ్ మహరాజ్ ఓవర్లో సింగిల్ తీసి పొట్టి ఫార్మాట్లో రెండో సెంచరీ నమోదు చేశాడు. తద్వారా ఈ ఫీట్ సాధించిన నాలుగో క్రికెటర్గా సంజూ నిలిచాడు. అతడి కంటే ముందు గుస్తవ్ మెక్కియాన్, రీలే రస్సో(దక్షిణాఫ్రికా), ఫిల్ సాల్ట్(ఇంగ్లండ్)లు మాత్రమే వరుసగా రెండు టీ20ల్లో మూడంకెల స్కోర్ చేశారు.