లక్నో: ఇద్దరు వ్యక్తులు నకిలీ రూ.500 నోట్లు తయారు చేశారు. (500 Fake Notes) రూ.10 స్టాంప్ పేపర్‌పై ఆ నోట్లను ముద్రించారు. వాటిని మార్కెట్లో చెలామణి చేశారు. ఫేక్ కరెన్సీ రాకెట్ గురించి తెలుసుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మినరల్ వాటర్ ప్రకటనలు ముద్రించే ఇద్దరు వ్యక్తులు యూట్యూబ్ ద్వారా నకిలీ నోట్ల తయారీ గురించి తెలుసుకున్నారు. మీర్జాపూర్ నుంచి రూ.పది స్టాంప్ పేపర్లు కొనుగోలు చేశారు. కంప్యూటర్, ప్రింటర్ ద్వారా రూ.500 నకిలీ నోట్లు ముద్రించారు. రూ.30,000 విలువైన నోట్లను మార్కెట్లో చెలామణి చేశారు. మరో రూ.10,000 విలువైన 20 నకిలీ రూ.500 నోట్లను సోన్‌భద్రలోని రామ్‌గఢ్ మార్కెట్లో సర్క్యులేట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే అన్ని నోట్లకు ఒకే సిరీస్ ఉండటంతో పట్టుబడిపోయారు.
కాగా, అరెస్ట్ చేసిన నిందితులను సతీష్ రాయ్, ప్రమోద్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. నకిలీ కరెన్సీ నోట్ల తయారీకి స్టాంప్ పేపర్లు వినియోగిస్తున్నారని పోలీస్ అధికారి తెలిపారు. ఆ నోట్లను జాగ్రత్తగా పరిశీలిస్తే తప్ప నకిలీ నోట్లుగా గుర్తించడం కష్టమని అన్నారు. రూ.500 నకిలీ నోట్లు 20, ముద్రణకు వినియోగించే పరికరాలు, ల్యాప్‌టాప్, ప్రింటర్, 27 స్టాంప్ పేపర్లతోపాటు ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.