టీమిండియా యువ వికెట్ కీపర్, ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న సంజూ శాంసన్‌కు ఊహించని అవకాశం వచ్చింది. టీమిండియా టీ20 జట్టులో అతడిని పెద్దగా పట్టించుకోని సెలక్టర్లు.. తాజాగా వెస్టిండీస్‌తో ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కు శాంసన్‌ను ఎంపిక చేశారు. కెఎల్ రాహుల్ స్థానాన్ని శాంసన్ భర్తీ చేయనున్నాడు.
గాయం నుంచి కోలుకుని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో చికిత్స పొందుతూ కరోనా బారిన పడ్డాడు రాహుల్. దీంతో అతడు విండీస్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికైనా ఇక్కడే ఆగిపోవాల్సి ఉంది. అయితే నిన్నటిదాకా అతడి రిప్లేస్మెంట్ ఎవరూ లేరని చెప్పుకొచ్చిన బీసీసీఐ తాజాగా శాంసన్ పేరును చేర్చింది. కొద్దిరోజుల క్రితం ఐర్లాండ్‌తో ముగిసిన టీ20 సిరీస్‌లో రాణించిన శాంసన్.. వెస్టిండీస్‌తో వన్డేలలో కూడా వికెట్ కీపర్ బాధ్యతలు నిర్వర్తించాడు. మిడిలార్డర్లో ఫర్వాలేదనిపించడంతో అతడికి టీ20 జట్టులో అవకాశమిచ్చారు సెలక్టర్లు.
వాస్తవానికి ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ జట్టులో సంజూ శాంసన్ పేరు ఉండేది అనుమానమే. ఇప్పటికే దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్‌లు వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి తీవ్రంగా పోటీ పడుతున్నారు. కాగా, విండీస్‌తో సిరీస్‌లో శాంసన్‌కు గనక అవకాశం వచ్చి అతడు రాణించగలిగితే పొట్టి ప్రపంచకప్ ప్రాబబుల్స్‌లో అతడూ ఉండే అవకాశం ఉంటుంది. మరి శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా..? లేదా..? అనేది కొద్దిసేపట్లో తేలనుంది.
విండీస్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేష్ కార్తీక్, రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ , అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్