BGT 2024-25 : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టుకు సమయం దగ్గరపడుతోంది. శుక్రవారం ఉదయం భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ (Perth) వేదికగా టెస్టు సమరం మొదలవ్వనుంది. విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని ఆతిథ్య ఆసీస్, పర్యాటక టీమిండియా జట్లు పట్టుదలతో ఉన్నాయి. అందుకని మైదానంలో అనుసరించాల్సిన వ్యూహాలు, తుది జట్టు కూర్పుపై పెద్ద కసరత్తే చేస్తున్నాయి.
భారత్ విషయానికొస్తే.. గత రెండు పర్యటనల్లో విజయం సాధించామనే దీమా ఉన్నప్పటికీ తొలి పోరుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేడు. దాంతో, కుర్ర ఓపెనర్ యశస్వీకి తోడుగా ఇన్నింగ్స్ మొదలెట్టేది ఎవరు? అనే ప్రశ్నకు ఇంకా సమాధానం దొరకలేదు. కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తున్నా అతడి ఫామ్‌పై కొందరు పెదవి విరుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ ఆటగాడు, ప్రస్తుతం కామెంటేటర్‌గా ఉన్న సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) తుది జట్టును అంచనా వేశాడు. అందులో ఎవరెవరు ఉన్నారంటే..?
పెర్త్‌లో తొలి టెస్టు అంటేనే 2020లో 36 పరుగులకే ఆలౌట్ అయిన భయం భారత క్రికెటర్లను, అభిమానులను వెంటాడడం ఖాయం. అందుకని ఈసారి తడాఖా చూపించాలి అని భారత ఆటగాళ్లు నెట్స్‌లో చాలాసేపు చెమటోడ్చారు. తుది జట్టు కూర్పు విషయానికొస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి ఆడుతున్న యశస్వీ జైస్వాల్‌కు జతగా రంజీ వీరుడు అభిమన్యు ఈశ్వరన్ (Abhimanyu Easwaran)ను పంపాలని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడుతున్నాడు.
దేశవాళీలో శతకాలతో విరుచుకుపడుతున్న అభిమన్యు భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల దిట్ట అని అతడి ఆలోచన. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లీ బదులు యువకెరటం ధ్రువ్ జురెల్(Dhruv Jurel)ను సంజయ్ ఎంపిక చేశాడు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా ఏ జట్టుపై జురెల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. అందుకని జురెల్‌ను మూడో స్థానంలో ఆడితే బెటర్ అని అతడు భావిస్తున్నాడు.
Australia vs India
First Test
PerthAre you ready? 🤩 pic.twitter.com/PHIvwCLQjN
— ESPNcricinfo (@ESPNcricinfo) November 19, 2024
ఇక నాలుగులో కోహ్లీని పంపాలని.. అనంతరం రిషభ్ పంత్, రాహుల్, జడేజా, సుందర్‌లను ఆడించాలని సంజయ్ అంటున్నాడు. ఇక పేస్ బౌలింగ్ విషయానికొస్తే.. కెప్టెన్ బుమ్రాకు తోడుగా సిరాజ్, ఆకాశ్ దీప్‌లు బంతిని పంచుకుంటారని ఈ మాజీ క్రికెటర్ సూచించాడు. అయితే.. పెర్త్‌లో పిచ్ మీద పచ్చిక 10 మిల్లీమీటర్ల ఎత్తులో ఉండనుండడంతో పేస్, బౌన్స్‌కు అనుకూలించనుందని సమాచారం. అందుకని పరిస్థితులను బట్టి తుది జట్టు కూర్పు ఉండనుంది.
మంజ్రేకర్ తుది జట్టు : అంచనా యశస్వీ జైస్వాల్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్, విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, సిరాజ్, ఆకాశ్ దీప్.