మియాపూర్ : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదైనా విధ్వంసమే తప్పితే అభివృద్ధి శూన్యమని బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ(BRS MLC) శంభీపూర్ రాజు ( Shambhipur Raju) విమర్శించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం మంగళవారం ఆల్విన్ కాలనీ డివిజన్లోపార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి సతీష్రావు ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ కాంగ్రెస్(Congress) పాలనలో ఏ వర్గమూ సంతృప్తికరంగా లేరని పేర్కొన్నారు. ఏడాది పాలనపై కాంగ్రెస్ జరుకుంటున్నది విజయోత్సవం కాదని, సంవత్సరీకమని దుయ్యబట్టారు. నియోజకవర్గ పార్టీ శ్రేణుల కఠోర శ్రమతో ఎమ్మెల్యేగా గెలిచిన అరెకపూడి గాంధీ పార్టీ మారి తీవ్రమైన మోసం చేసారని తక్షణమే ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అభివృద్ధి బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు. కేవలం బీఆర్ఎస్, పార్టీ శ్రేణులను తిట్టడమే పనిగా పెట్టుకున్నదన్నారు. గాంధీ పేరు పెట్టుకుని గాడ్సెలాగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యేకు తగిన గుణపాఠం నేర్పిస్తామన్నారు.
ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో నాయకులే కాంగ్రెస్లో చేరారని, బీఆర్ఎస్ శ్రేణులు ఎవరూ పార్టీ మారలేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్లు మాధవరం రోజాదేవి, జూపల్లి సత్యనారాయణ , జగన్, మంత్రి సత్యనారాయణ సహా పార్టీ నేతలు పాల్గొన్నారు.