Rajasthan Royals : ఐపీఎల్ పంతొమ్మిదో సీజన్ ముందు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) హెడ్‌కోచ్, కెప్టెన్ తలనొప్పి మొదలైంది. ‘నన్ను వదిలేయండి’ అని సంజూ శాంసన్ (Sanju Samson) ఫ్రాంచైజీని కోరగా.. ‘నేను కోచింగ్ ఇవ్వలేను’ అంటూ రాహుల్ ద్రవిడ్ (RahulDravid) వైదొలగాడు. దాంతో.. అనుభవజ్ఞుడైన కోచ్‌తో పాటు జట్టును సమర్ధంగా నడిపించగల నాయకుడిని వెతుకుతోంది రాజస్థాన్. ఈనేపథ్యంలో.. కుమార సంగక్కర్ (Kumar Sangakkara) మళ్లీ కోచ్‌గా రావడం దాదాపు ఖరారైనట్టే.
ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో రాజస్థాన్ తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో.. వచ్చే సీజన్లో మెరుగైన ప్రదర్శనతో ట్రోఫీ గెలవాలని ఫ్రాంచైజీ ఆశిస్తోంది. అందుకని ‘డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’గా, కోచ్‌గా సేవలందించిన సంగక్కరకు మళ్లీ కోచ్ పదవి ఆఫర్ చేస్తోంది యాజమాన్యం. అందుకు ఈ వెటరన్ ప్లేయర్ కూడా సిద్ధంగానే ఉన్నాడని సమాచారం.. అధికారిక ప్రకటన రావడమే ఆలస్యం అతడు రాజస్థాన్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపడుతాడని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి.
🚨 KUMAR SANGAKKARA IS BACK 🚨
– Sangakkara will back in the lead role in the Coaching staff of Rajasthan Royals for IPL 2026. [Espn Cricinfo] pic.twitter.com/uIncLSHenH— maddyCric (@imRaghav001) September 25, 2025
సంగక్కర మళ్లీ రాజస్థాన్ కోచింగ్ బాధ్యతలు చేపడితే మొదటగా అతడు చేయాల్సింది సంజూ శాంసన్‌ను ఒప్పించడం. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఉండడంతో శాంసన్ మాట వినే అవకాశాలున్నాయి. ఒకవేళ.. అతడు వినకుంటే ట్రేడ్ పద్ధతిన ఎవరిని తీసుకోవాలి? అనే విషయంపై ఫ్రాంచైజీ పెద్దలతో సంగక్కర చర్చించనున్నాడు. అలానే తదుపరి కెప్టెన్‌గా రేసులో ఉన్న రియాన్ పరాగ్‌ను మరింత సానబెట్టడం, జట్టుకు రెండో ఐపీఎల్ ట్రోఫీ అందించడం వంటి సవాళ్లు ఈ దిగ్గజ ఆటగాడికి ఎదురుకానున్నాయి.
శ్రీలంక దిగ్గజ ఆటగాడైన సంగక్కర 2021లో రాజస్థాన్ ఫ్రాంచైజీలో చేరాడు. డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు కోచ్‌గా నియమితులయ్యాడు. అతడి దిశానిర్దేశనంలో, సంజూ శాంసన్ కూల్ కెప్టెన్సీ తోడవ్వడంతో రాజస్థాన్ నాలుగు పర్యాయాలు ప్లే ఆఫ్స్ ఆడింది. ఆరంభ ఎడిషన్‌లో ఛాంపియన్‌గా అవతరించిన రాజస్థాన్ 2022లో బట్లర్, బౌల్ట్ జోరుతో ఫైనల్ చేరింది. కానీ, టైటిల్ పోరులో హార్దిక్ పాండ్యా సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచింది.
రాజస్థాన్ కోచింగ్ సిబ్బంది విషయానికొస్తే.. టీమిండియా మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్ కోచ్‌గా కొనసాగనున్నాడు. బౌలింగ్ కోచ్‌గా షేన్ బాండ్ సేవల్ని యాజమాన్యం ఉపయోగించుకోనుంది. అలానే సంగక్కర హయాంలో సపోర్టింగ్ స్టాఫ్‌గా ఉన్న ట్రెవర్ పెన్నీ, సిద్ధార్థ లహిరి తిరిగి జట్టుతో కలిసే అవకాశముంది.