స్వదేశంలో భారత జట్టుపై మరో టెస్టు సిరీస్ వైట్‌వాష్ కత్తి వేలాడుతున్నది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా తేరుకోని టీమ్ఇండియాకు మరోసారి అదే తరహా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు వరల్డ్ టెస్ట్ చాంపియన్లు సిద్ధమయ్యారు. డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్ హోదాలో భారత గడ్డపై అడుగిడిన దక్షిణాఫ్రికా స్థాయికి తగ్గ ఆటతీరుతో రాణించి ఉపఖండంలో సరికొత్త చరిత్రను సృష్టించేందుకు 8 వికెట్ల దూరంలో నిలిచింది. అన్ని విభాగాల్లోనూ విఫలమవుతున్న పంత్ సేన.. నాలుగో రోజూ నిరాశపర్చడంతో టీమ్ఇండియా ఎదుట సఫారీలు 549 పరుగుల రికార్డు లక్ష్యాన్ని నిలిపారు. ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయిన భారత జట్టు.. ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవడం దేవుడెరుగు కానీ గువహటి టెస్టును డ్రా చేసుకున్నా అద్భుతం చేసినట్టే!
గువహటి: దక్షిణాఫ్రికాతో గువహటి వేదికగా జరుగుతున్న రెండో టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తున్నది. మెన్ ఇన్ బ్లూ ఎదుట సఫారీలు 549 పరుగుల కొండంత లక్ష్యాన్ని నిలుపగా నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఓపెనర్లిద్దరి వికెట్లను కోల్పోయిన భారత్ 27/2తో కష్టాల్లో పడింది. ఐదో రోజు భారత విజయానికి 522 పరుగులు కావాల్సి ఉండగా ఉపఖండంపై చరిత్ర సృష్టించేందుకు సఫారీలకు 8 వికెట్లు తీస్తే సరిపోతుంది. అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌ను దక్షిణాఫ్రికా 260/5 వద్ద డిక్లేర్డ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ (288) ఆధిక్యంతో కలిపి ఆతిథ్య జట్టు ఎదుట రికార్డు లక్ష్యాన్ని నిలుపగలిగింది. ట్రిస్టన్ స్టబ్స్ (180 బంతుల్లో 94, 9 ఫోర్లు, 1 సిక్స్) తృటిలో శతకాన్ని కోల్పోగా టోని డి జోర్జి (49)అతడికి అండగా నిలిచాడు.
మూడో రోజుకే 300కు పైచిలుకు ఆధిక్యం కల్గిన దక్షిణాఫ్రికా.. నాలుగో రోజు ఉదయం సెషన్లో వేగంగా ఆడేందుకు యత్నించినా 17 పరుగుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. సీనియర్ స్పిన్నర్ జడేజా (4/62).. తొలి గంట ఆటలో రికెల్టన్ (35) ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు. డ్రింక్స్ తర్వాత మార్క్మ్ (29), బవుమా (3) సైతం నిష్క్రమించడంతో సఫారీల ఆటలు సాగవనే అనుకున్నారంతా! కానీ స్టబ్స్ మా త్రం భారత్‌కు షాకిచ్చాడు. తన శైలికి పూర్తి భిన్నంగా ఆడిన అతడు.. డిఫెన్స్‌కే ప్రాధాన్యమిస్తూ దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని క్రమంగా పెంచా డు. జోర్జితో కలిసి నాలుగో వికెట్‌కు 101 రన్స్ జోడించిన అతడు.. ఆ తర్వాత మల్డర్ (35)తోనూ 82 పరుగులు జతచేశాడు.
రికార్డు ఛేదనలో టీమ్ఇండియా 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. జైస్వాల్ (13).. మరోసారి యాన్సెన్ బౌలింగ్‌లో కీపర్ వెరీన్కు క్యాచ్ ఇచ్చాడు. రెండు ఓవర్ల తర్వాత బంతినందుకున్న హర్మర్.. మరో ఓపెనర్ రాహుల్ (6)ను క్లీన్‌బౌల్డ్ చేసి దక్షిణాఫ్రికా శిబిరంలో సంతోషాన్ని రెట్టింపు చేశాడు.
టెస్టుల్లో భారత జట్టు అత్యధిక ఛేదన 387
(2008లో ఇంగ్లండ్‌పై చెన్నైలో) ఆసియాలో ఏ జట్టు కూడా 400కు మించిన లక్ష్యాన్ని ఛేదించలేదు.
హయ్యస్ట్ చేజింగ్ 395
(బంగ్లాదేశ్‌పై వెస్టిండీస్)
దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్: 489; భారత్ ఫస్ట్ ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 78.3 ఓవర్లలో 260/5 డిక్లేర్డ్ (స్టబ్స్ 94, జోర్జి 49, జడేజా 4/62, వాషింగ్టన్ 1/67); భారత్ రెండో ఇన్నింగ్స్: 15.5 ఓవర్లలో 27/2 (జైస్వాల్ 13, హర్మర్ 1/1)