Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) భారత పర్యటన కొనసాగుతోంది. ‘గోట్ ఇండియా టూర్’లో ఇండియాకి వచ్చిన మెస్సి.. ఇక్కడ ప్రధాన నగరాల్లో సందడి చేస్తున్నారు. తొలిరోజు కోల్‌కతా, హైదరాబాద్ నగరాలను సందర్శించిన మెస్సి.. రెండో రోజు ముంబైలో సందడి చేశారు. ఇవాళ దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ ఉదయం 10:45 గంటలకు ఢిల్లీలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం అక్కడ పొగమంచు కారణంగా విమానం ఆలస్యమైనట్లు తెలుస్తోంది.
ఇక మెస్సి రాక సందర్భంగా నగరంలో అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మెస్సి, అతని టీం కోసం చాణక్యపురిలోని ది లీలా ప్యాలెస్ (Leela Palace)లో ప్రత్యేకంగా ఓ అంతస్తు మొత్తాన్ని రిజర్వ్ చేశారు. అర్జెంటీనా జట్టు హోటల్లోని ప్రెసిడెన్షియల్ సూట్స్‌లో బస చేయనుంది. ఇక్కడ ఒక్క రాత్రికి రూ.3.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ ఖర్చవుతుందని సమాచారం. ఇక మెస్సి బస గురించి ఎలాంటి వివరాలను పంచుకోవద్దని అక్కడి హోటల్ సిబ్బందికి నిర్వాహకులు కఠినమైన ఆదేశాలు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తాజాగా తెలిపాయి. ఇక ఈ స్టార్ ప్లేయర్ బస చేసే హోటల్ చుట్టూ భద్రతను పెంచారు.
ఇక హోటల్లో నిర్వాహకులు ‘మీట్ అండ్ గ్రీట్’ను ఏర్పాటు చేశారు. పలువురు కార్పొరేట్లు, వీఐపీలు మెస్సిని కలవనున్నారు. పలు నివేదికల ప్రకారం.. మెస్సిని కలిసేందుకు పలువురు భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. కొందరు కార్పొరేట్లు ఫుట్‌బాల్ ఐకాన్‌ను కలిసి హ్యాండ్ షేక్ కోసం రూ.కోటి వరకూ ఖర్చు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఢిల్లీ పర్యటనలో మెస్సి.. భారత ప్రధాన న్యాయమూర్తి, పలువురు ఎంపీలు, క్రికెటర్లు, ఒలింపిక్, పారాలింపిక్ పతక విజేతలను కలవనున్నారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియాన్ని సందర్శించనున్నారు మెస్సి. అక్కడే భారత క్రికెట్ బృందంతో సంభాషించనున్నట్లు తెలిసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పారాలింపిక్లో బంగారు పతక విజేత సుమిత్ అంటిల్, బాక్సింగ్ ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, ఒలింపిక్ హైజంప్ పతక విజేత నిషాద్ కుమార్ సహా పలువురిని మీట్ అవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం 6 గంటలకు మెస్సి ఇండియా టూర్ ముగియనుంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీ పర్యటన ముగించుకొని మెస్సి వెళ్లిపోనున్నారు. తన పర్యటనలో ప్రధాని మోదీతో కూడా మెస్సి భేటీ అవుతారని ముందుగా వార్తలు వచ్చాయి. అయితే, ప్రధాని ఇవాళ ఉదయమే మూడు దేశాల పర్యటన నిమిత్తం బయల్దేరి వెళ్లారు.
Also Read..
Sabarimala | శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు.. 25 లక్షలు దాటిన సంఖ్య
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన, రైలు రాకపోకలపై ప్రభావం
PM Modi | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. ప్రధాని విదేశీ పర్యటనపై తీవ్ర ప్రభావం