రాజస్థాన్ రాయల్స్ చిన్నోడు వైభవ్ సూర్యవంశీ మళ్లీ చితక్కొట్టాడు! ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో రౌద్రరూపం దాల్చి రికార్డుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు! 15 ఏండ్ల ఈ వండర్ కిడ్ వీరంగానికి ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ బలైంది.! క్రీజులో అడుగుపెట్టిన క్షణం నుంచే ప్రత్యర్థి బౌలింగ్‌ను ఊచకోత కోసిన ఈ బీహార్ కుర్రాడు తనకంటే రెట్టింపు వయసున్న వరల్డ్ క్లాస్ బౌలర్ కమిన్స్ బంతులను మంచినీళ్ల ప్రాయంగా స్టాండ్స్‌కు పంపిసూ ్త బౌలర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. కేవలం 29 బంతుల్లోనే 12 సిక్సర్లు, 5 ఫోర్లతో 97 పరుగులు దంచేశాడు. ఈ క్రమంలోనే క్రిస్ గేల్ పేరిట ఉన్న సింగిల్ సీజన్ హయ్యెస్ట్ సిక్సర్ల (65) రికార్డును బ్రేక్ చేశాడు. ఒక్క షాట్ దూరంలో ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ చేజారినా.. టీ20 క్రికెట్‌కు తానే నయా బాస్ అనిపించుకున్నాడు. అతని జోరుతో హైదరాబాద్‌ను ఎలిమినేట్ చేసిన రాజస్థాన్ రేపు గుజరాత్‌తో క్వాలిఫయర్-2కు రెడీ అయింది.
ముల్లన్పూర్: ఐపీఎల్19వ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పోరు ముగిసింది. లీగ్ దశలో రాజస్థాన్ రాయల్స్‌పై రెండుసార్లు గెలిచిన రైజర్స్ ఈసారి యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో తేలిపోయి 47 రన్స్ తేడాతో చిత్తయింది. తొలుత రాజస్థాన్ 20 ఓవర్లలో243/8 స్కోరు చేసింది. వైభవ్‌తో పాటు ధ్రువ్ జురెల్ (21 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 50) కూడా రాణించాడు. అనంతరం ఛేజింగ్‌లో రైజర్స్ 19.2 ఓవర్లలో 196 రన్స్‌కే ఆలౌటైంది. నితీశ్ రెడ్డి (38), సలీల్ అరోరా (35), ఇషాన్ (33) టాప్ స్కోరర్లు. జోఫ్రా ఆర్చర్ (3/58), జడేజా (2/21) దెబ్బకొట్టారు. వైభవ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
భారీ హిట్లర్లంతా బ్యాట్లెత్తేయడంతో రికార్డు ఛేదనలో సన్‌రైజర్స్ చతికిల పడింది. రాజస్థాన్ స్టార్ పేసర్ ఆర్చర్ అద్భుత బౌలింగ్‌లో హైదరాబాద్‌ను వణకించాడు. ఇన్నింగ్స్ రెండో బాల్కే ఓపెనర్ అభిషేక్ (0)ను గోల్డెన్ డకౌట్ చేసి.. రైజర్స్ పతనాన్ని ఆరంభించాడు. వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేసినా.. మూడో ఓవర్లో ఫెరీరా క్యాచ్‌తో అతడిని పెవిలియన్ చేర్చిన ఆర్చర్ మరో దెబ్బకొట్టాడు. నాలుగు బంతుల తర్వాత బర్గర్ బౌలింగ్‌లో స్మరన్ (1) కూడా పెవిలియన్ బాట పట్టాడు. ఇక ఐదో ఓవర్లో ఆర్చర్ విసిరిన 150.4 కి.మీ స్పీడ్ బాల్‌కు హెడ్ (17) క్లీన్ బౌల్డ్ అవ్వడంతో 54/4తో రైజర్స్ పూర్తిగా డిఫెన్స్‌లో పడిపోయింది. ఆదుకుంటాడని ఆశించిన మరో హార్డ్ హిట్టర్ క్లాసెన్ (18)ను ఏడో ఓవర్లో యశ్‌రాజ్ ఐదో వికెట్‌గా ఎల్బీ చేశాడు. ఈ దశలో నితీశ్ రెడ్డి, సలీల్ అరోరా కొద్దిసేపు ప్రతిఘటించారు. ఆరో వికెట్‌కు 50 రన్స్ జోడించిన తర్వాత జడేజా బౌలింగ్‌లో నితీశ్.. షనకకు క్యాచ్ ఇవ్వగా.. వెంటనే కెప్టెన్ కమిన్స్ (1) ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లోనే సలీల్ కూడా క్యాచ్ ఔటవడంతో రైజర్స్ ఓటమి ఖాయమైంది. ఆఖరి ఓవర్ వరకు పోరాడిన శివాంగ్ కుమార్ (27) వైభవ్‌కు క్యాచ్ ఇవ్వడంతో హైదరాబాద్ పోరాటం ముగిసింది.
వైభవ్ సూర్యవంశీ ఈ ఐపీఎల్‌కే స్పెషల్‌గా నిలిచే ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోవడంతో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ భారీ స్కోరు చేసింది. తొలి ఓవర్ నుంచే సన్‌రైజర్స్ బౌలర్లపై వైభవ్ విరుచుకుపడ్డాడు. ఈషాన్ మలింగ బౌలింగ్‌లో సిక్సర్‌తో ఖాతా తెరిచిన అతను.. మూడో ఓవర్లో కెప్టెన్ కమిన్స్‌ను టార్గెట్ చేశాడు. ఖతర్నాక్ షాట్లతో హ్యాట్రిక్ సిక్సర్లు, ఓ ఫోర్‌తో 25 పరుగులు పిండుకున్నాడు. సాకిబ్ హుస్సేన్ వేసిన నాలుగో ఓవర్లో మరో 3 సిక్సర్లు బాది కేవలం 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఓవైపు సూర్యవంశీ విజృంభిస్తుంటే.. మరో ఎండ్‌లో జైస్వాల్ (29) సింగిల్స్ తీస్తూ అతనికి స్ట్రయిక్ ఇచ్చాడు. పవర్‌ప్లేలోనే రాజస్థాన్ 80 రన్స్ చేస్తే. ఇందులో జైస్వాల్ సహకారం 19 పరుగులే ఉన్నాయంటే వైభవం విధ్వంసం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఫీల్డింగ్ మారిన తర్వాత కూడా సూర్య సిక్సర్ల వేట ఆగలేదు. ఏడో ఓవర్లో సాకిబ్ హుస్సేన్‌కు మరో సిక్సర్ రుచి చూపించిన వైభవ్.. ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో చెలరేగాడు. దాంతో క్రిస్ గేల్ పేరిట ఉన్న ఐపీఎల్ ఫాస్టెస్ట్ సెంచరీ (30 బంతుల్లో) రికార్డును బద్దలు కొట్టడం ఖాయం అనిపించింది. కానీ, హింగే వేసిన షార్ట్ పిచ్ బంతిని అప్పర్ కట్ చేయబోయి డీప్ థర్డ్ మ్యాన్ వద్ద స్మరన్‌కు క్యాచ్ ఇచ్చిన వైభవ్ తీవ్ర నిరాశతో వైభవ్ పెవిలియన్ చేరాడు. తొలి వికెట్‌కు 125 పరుగుల భాగస్వామ్యం ముగిసిన తర్వాత జైస్వాల్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.
శివాంగ్ గూగ్లీకి భారీ షాట్ ఆడబోయి అభిషేక్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురెల్, కెప్టెన్ రియాన్ పరాగ్ (26)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపాడు. జురెల్ కూడా సన్‌రైజర్స్ బౌలర్లను ఆడుకుంటూ భారీ షాట్లతో ఫోర్లు, సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో 20 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. రాజస్థాన్ 14.4 ఓవర్లలోనే 200 పరుగుల మార్కును దాటింది. కానీ, అదే ఓవర్ చివరి బాల్‌కు హింగే బౌలింగ్‌లో నితీశ్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 15 ఓవర్లకు 207/3తో నిలిచిన రాయల్స్ 270 స్కోరుచేసేలా కనిపించింది. కానీ, స్లాగ్ ఓవర్లలో సన్‌రైజర్స్ బౌలర్లు పుంజుకున్నారు. అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి చివరి ఐదు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు. షనక (5), డొనొవన్ ఫెరీరా (12), బర్గర్ (1), ఆర్చర్ (4) ఫెయిలయ్యారు. రవీంద్ర జడేజా (11 నాటౌట్) పోరాటంతో రాజస్థాన్
240 మార్కు దాటింది.
సన్‌రైజర్స్ బౌలింగ్‌ను ఊచకోత కోసిన వైభవ్ సూర్యవంశీ తన సునామీ ఇన్నింగ్స్‌లో పలు రికార్డులు బ్రేక్ చేశాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 243/8 (వైభవ్ 93, జురెల్ 50, హింగే 3/54);
హైదరాబాద్: 19.2 ఓవర్లలో 196 ఆలౌట్ (నితీశ్ 38, సలీల్ 35, ఆర్చర్ 3/58, జడేజా 2/21)