RCB | బెంగళూరు: ఐపీఎల్-18లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అదరగొట్టింది. ఈ సీజన్లో ప్రత్యర్థులను వారి సొంతగడ్డపై మట్టికరిపిస్తున్న బెంగళూరు..చిన్నస్వామిలో హ్యాట్రిక్ ఓటముల తర్వాత తొలి విజయాన్ని నమోదు చేసింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో హోరాహోరీగా జరిగిన హైస్కోరింగ్ థ్రిల్లర్‌లో బెంగళూరు.. ప్రత్యర్థిని 11 పరుగుల తేడాతో ఓడించింది.
206 పరుగుల భారీ ఛేదనలో రాజస్థాన్.. 194/9 వద్దే ఆగిపోయింది. యశస్వి జైస్వాల్ (19 బంతుల్లో 49, 7 ఫోర్లు, 3 సిక్సర్లు), ధ్రువ్ జురెల్ (34 బంతుల్లో 47, 3 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఆఖర్లో తడబడ్డ రాజస్థాన్‌కు మరో అపజయం తప్పలేదు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు.. విరాట్ కోహ్లీ (42 బంతుల్లో 70, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (27 బంతుల్లో 50, 4 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ శతకాలతో చెలరేగడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205/5 పరుగుల భారీ స్కోరు సాధించింది.
భారీ ఛేదనను రాజస్థాన్ దూకుడుగానే ఆరంభించింది. భువీ వేసిన ఇన్నింగ్స్ తొలి బంతినే సిక్సర్‌గా మలిచిన యశస్వి.. వైభవ్ (16)తో కలిసి తొలి వికెట్‌కు 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దయాల్ రెండో ఓవర్లో 4, 4, 6తో రెచ్చిపోయిన జైస్వాల్.. హాజిల్‌వుడ్ ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు దంచాడు. భువీ 5వ ఓవర్లో తొలి బంతిని ఎక్స్ట్రా కవర్స్ దిశగా భారీ సిక్సర్ బాదిన వైభవ్.. రెండో బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. హాజిల్‌వుడ్ 6వ ఓవర్లో రెండు బౌండరీలతో పాటు ఓ సిక్సర్ కొట్టిన జైస్వాల్.. షార్ట్ లెంగ్త్ బంతిని ఆడబోయి మిడ్వికెట్లో షెపర్డ్‌కు దొరికిపోయాడు. క్రీజులోకి రావడంతోనే సిక్సర్‌తో బాదుడు మొదలెట్టిన నితీశ్ (28).. దయాల్ బౌలింగ్‌లో రెండు బౌండరీలు రాబట్టాడు.
9 ఓవర్లకే వంద పరుగుల మార్కును దాటిన రాజస్థాన్.. స్పిన్నర్ల రాకతో తడబడింది. పది బంతుల్లోనే రెండు ఫోర్లు, రెండు సిక్సర్లతో జోరు మీద కపిపించిన సారథి రియాన్ పరాగ్ (22)ను కృనాల్ పదో ఓవర్లో ఫస్ట్‌బాల్‌కే బోల్తా కొట్టించాడు. సుయాశ్ వికెట్లేమీ తీయకపోయినా పరుగులను కట్టడి చేశాడు. కృనాల్.. 14వ ఓవర్లో నితీశ్‌నూ ఔట్ చేయడంతో రాజస్థాన్ కష్టాల్లో పడింది.
హెట్మెయర్ (11)ను హాజిల్‌వుడ్ పెవిలియన్‌కు పంపాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా జురెల్ మాత్రం క్రీజులో నిలిచాడు. చివరి 3 ఓవర్లలో ఆ జట్టు విజయానికి 40 పరుగులు అవసరమవగా.. భువీ 18వ ఓవర్లో జురెల్ 6, 4, 4 రాబట్టగా శుభమ్ (12) ఓ సిక్సర్ కొట్టడంతో రాజస్థాన్ గెలుపు రేసులోకి వచ్చింది. కానీ హాజిల్‌వుడ్.. 19వ ఓవర్లో ఒకే పరుగిచ్చి జురెల్, ఆర్చర్‌ను ఔట్ చేశాడు. దయాల్ ఆఖరి ఓవర్లో తొలి బంతికే శుభమ్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు విజయం ఖరారైంది.
సొంతగడ్డపై ఆడిన గత మూడు మ్యాచ్‌లతో పోలిస్తే ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్యాటింగ్ మెరుగైంది. దూకుడు మీదున్న ఓపెనింగ్ ద్వయం ఫిల్ సాల్ట్ (26), కోహ్లీ.. ఆరంభం నుంచే రాజస్థాన్ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. తొలి వికెట్‌కు ఈ ఇద్దరూ 6.4 ఓవర్లలోనే 61 పరుగులు జోడించి బెంగళూరుకు శుభారంభం అందించారు. ఆర్చర్ మొదటి ఓవర్లో కోహ్లీ బౌండరీతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టి అతడే వేసిన మూడో ఓవర్లోనూ ఫైన్‌లెగ్, స్కేర్ లెగ్ దిశగా ఫోర్లు కొట్టాడు.
తుషార్ 5వ ఓవర్లో సాల్ట్ రెండు బౌండరీలు రాబట్టాడు. పవర్ ప్లే తర్వాత బంతినందుకున్న హసరంగ.. తన తొలి ఓవర్లోనే సాల్ట్‌ను ఔట్ చేయడంతో బెంగళూరు తొలి వికెట్ కోల్పోయింది. సాల్ట్ నిష్క్రమించినా అతడి స్థానంలో వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లీ బెంగళూరు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సందీప్ 12వ ఓవర్లో రెండు ఫోర్లతో కోహ్లీ ఈ సీజన్లో ఐదో అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.
తుషార్ 15వ ఓవర్లో పడిక్కల్ రెండు భారీ సిక్సర్లతో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఇదే ఓవర్లో కోహ్లీ కూడా ఓ సిక్సర్ బాదడంతో బెంగళూరు ఖాతాలో 22 పరుగులు చేరాయి. ఆర్చర్ 16వ ఓవర్లో కోహ్లీ.. నితీశ్‌కు క్యాచ్ ఇవ్వడంతో 95 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సందీప్ ఒకటే ఓవర్లో పడిక్కల్, పటీదార్ (1)ను ఔట్ చేసినా ఆఖర్లో టిమ్ డేవిడ్ (23), జితేశ్ శర్మ (20 నాటౌట్) మెరుపులతో బెంగళూరు స్కోరు 200 పరుగులు దాటింది.
బెంగళూరు: 20 ఓవర్లలో 205/5 (కోహ్లీ 70, పడిక్కల్ 50, సందీప్ 2/45, హసరంగ 1/30);
రాజస్థాన్: 20 ఓవర్లలో 193/9 (జైస్వాల్ 49, జురెల్ 47, హాజిల్‌వుడ్ 4/33, కృనాల్ 2/31)