Cristiano Ronaldo : ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo) సౌదీ అరేబియా క్లబ్ తరఫున ఇరగదీస్తున్నాడు. అల్ నస్రీ(Al Nassr) జట్టుకు విజయాలు అందిస్తున్నాడు. అల్ అహ్లీ(Al Ahli) జట్టుతో మ్యాచ్ అనంతరం కొందరు అతడి పనైపోయిందంటూ కామెంట్లు చేశారు. ఆ వార్తలపై స్పందించిన రొనాల్డో తన పని అయిపోలేదని, తన కాళ్లు అలసిపోయేంత వరకూ ఫుట్‌బాల్‌ను వీడనని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘చాలామంది రొనాల్డో పని అయిపోయింది అంటున్నారు. కానీ, అది నిజం కాదు. నా కాళ్లు అలసిపోయామని చెప్పేంత వరకూ నేను ఫుట్‌బాల్ ఆడుతూనే ఉంటా. ఎందుకంటే.. నేను ఇప్పటికీ ఆటను ప్రేమిస్తూనే ఉన్నా. అంతేకాదు గోల్స్ కొడుతున్నా. ఏళ్లుగా ఆడుతున్నా గెలవాలనే కసి కొంచెం కూడా తగ్గలేదు’ అని 38 ఏళ్ల రొనాల్డో వెల్లడించాడు. నిరుడు ఖతర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్ అనంతరం ఈ మిడ్‌ఫీల్డర్ అల్ నస్రీ క్లబ్‌కు మారాడు. రెండేన్నర ఏళ్ల కాలానికి రూ 4 వేల కోట్ల ఒప్పందం చేసుకున్నాడు. అతడి రాకతో ఈ సౌదీ క్లబ్ విజయాల బాట పట్టింది. నస్రీ క్లబ్‌కు రొనాల్డో అరబ్ క్లబ్ చాంపియన్స్ కప్(The Arab Club Championship Cup) ట్రోఫీ అందించాడు.
ఫుట్‌బాల్ లెజెండ్స్‌లో ఒకడైన రొనాల్డో తన అద్భుత ఆటతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఈమధ్యే అతను ఇన్స్టాగ్రామ్(Instagram)లో ఏకంగా 600 మిలియన్ల ఫాలోవర్ల మార్క్ చేరుకున్నాడు. అంటే.. అతడిని 60 కోట్ల మంది ఫాలో అవుతున్నారు. దాంతో, అత్యధిక మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.