Rohit Sharma | భారత జట్టు త్వరలో ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నది. ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడనున్నది. ఈ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే సారథ్యం వహించనున్నట్లు సమాచారం. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురైంది. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో ఘోర పరాజయం పాలైంది. ఆసిస్ పర్యటనలో ఐదు టెస్ట్‌కు రోహిత్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. జూన్ 20 నుంచి ఆగస్టు 4 వరకు జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు కెప్టెన్సీ బాధ్యతలను హిట్‌మ్యాన్‌కు అప్పగించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఫామ్ లేమితో ఇబ్బందిపడ్డాడు.
ఆ తర్వాత రోహిత్ శర్మతో పాటు పలువురు సీనియర్ ప్లేయర్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. టెస్టుల నుంచి తప్పించాలని మాజీలతో పాటు పలువురు అభిమానులు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రోహిత్ నాయకత్వంపై నమ్మకంతో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌కు అతన్నే కెప్టెన్‌గా నియమించాలని బీసీసీఐ భావిస్తున్నది. ఐపీఎల్ ముగింపు వరకు ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించనున్నది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు చాలా సమయం ఉన్నది. ఐపీఎల్ సుదీర్ఘంగా జరుగనుండడంతో అప్పటి వరకు ఎవరు అందుబాటులో ఉంటారో తేలనున్నది. అలాగే, ఫామ్ విషయంలోనూ స్పష్టత రానున్నది.
ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఐపీఎల్ చివరి వరకు టెస్టులకు జట్టులను ప్రకటించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తున్నది. ఐదు టెస్టుల సిరీస్‌కు ముందు రెండు నాలుగు రోజుల మ్యాచులు జరుగనున్నాయి. భారత-ఏ జట్టుతో జరిగే ఈ మ్యాచుల్లో.. కొందరు సీనియర్ ప్లేయర్లను ఎంపిక చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఐదు టెస్టుల కోసం టీమిండియా 45 రోజులు ఇంగ్లాండ్‌లో పర్యటిస్తుంది. మే 30న కాంటెర్‌బరీలోని సెయింట్ లారెన్స్‌లో తొలి నాలుగు రోజుల మ్యాచ్, జూన్ 6న నార్తాంప్టన్‌లో రెండో మ్యాచ్ జరుగుతుంది. జూన్ 20 నుంచి 24 వరకు హెడింగ్లీలో తొలి టెస్ట్ మొదలవుతుంది. చివరిదైన టెస్టు జూలై 31 నుంచి ఆగస్టు 4 వరకు జరుగనున్నది.