Rohit Sharma| టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ కొత్త హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ అభ్యర్థన మేరకు వచ్చే నెలలో శ్రీలంకతో జరుగబోయే వన్డే సిరీస్‌కు ఆడనున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది. ప్రస్తుతానికి రెస్ట్ మోడ్‌లో ఉన్నప్పటికీ లంకతో వన్డేలు ఆడేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకున్న హిట్‌మ్యాన్.. వన్డేలలో మాత్రం ఆడేందుకు సిద్ధంగా ఉంటే అతడే సారథిగా వ్యవహరిస్తాడు.
వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్ ఆరు వన్డేలు
మాత్రమే ఆడనుంది. అందులో ఒకటి లంకతో జరిగే సిరీస్ కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో ఒక సిరీస్ ఆడనుంది. కోచ్‌గా గంభీర్‌కు చాంపియన్స్ ట్రోఫీ ద్వారా కీలక సవాల్ ఎదురుకానున్న నేపథ్యంలో సీనియర్లు రోహిత్, బుమ్రా, కోహ్లీ ఇప్పట్నుంచే అందుకు సన్నద్ధంగా ఉండాలని గంభీర్ భావిస్తున్నాడు. ఈ మేరకు అతడు ఇదే విషయాన్ని సీనియర్ త్రయానికి వివరించినట్టు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ లంకతో సిరీస్ ఆడేందుకు నిశ్చయించుకున్నట్టు సమాచారం. తన సెలవులను కుదించుకుని ఆగస్టు నుంచి జరగనున్న మూడు వన్డేలకు అందుబాటులో ఉండనున్నట్టు బీసీసీఐకి చెప్పినట్టు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
Rohit Sharma & his family enjoying the vacation ❤️
– A lovely picture. pic.twitter.com/I6XjesuU90
— Johns. (@CricCrazyJohns) July 17, 2024
రోహిత్ వచ్చినా కోహ్లీ, బుమ్రా మాత్రం ఈ సిరీస్‌లో ఆడేది అనుమానమే. ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి లండన్‌లో ఉంటున్న కోహ్లీ బంగ్లాదేశ్‌తో సిరీస్ దాకా విశ్రాంతి తీసుకోనున్నాడు. ఇక బుమ్రా కూడా గంభీర్ రిక్వెస్ట్‌పై ఏ విధమైన అభిప్రాయాన్ని వెల్లడించలేదని సమాచారం. కాగా శ్రీలంకతో సిరీస్‌కు కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ రీఎంట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ ఇద్దరూ టీ20 ప్రపంచకప్ జట్టులో చోటు కోల్పోయిన విషయం విదితమే. లంక పర్యటనలో భాగంగా ఈనెల 27 నుంచి టీ20లు ఆడనున్న భారత్.. వచ్చే నెల 2 నుంచి 7 దాకా వన్డే సిరీస్ ఆడనుంది.