IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్లో బోణీ కొట్టేందుకు సిద్ధమైంది ముంబై ఇండియన్స్. వరుసగా 13వ సారి ఐపీఎల్ తొలి పోరులో ఓటమి పాలైన ముంబై విజయమే లక్ష్యంగా శనివారం గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. కీలకమైన ఈ మ్యాచ్‌కు ముందు ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) చిల్ అవుతూ కనిపించాడు.
గుజరాత్‌లోని జామానగర్‌లో బోటు షికారు చేస్తూ సరదాగా గడిపాడు టీమిండియా సారథి . అతడితో పాటు కుర్ర హిట్టర్ తిలక్ వర్మ, ముంబై టీమ్ సహాయక సిబ్బంది కూడా ఉన్నారు. వాటర్ స్పోర్ట్స్‌లో భాగంగా హిట్‌మ్యాన్ బోట్ రైడింగ్ చేస్తున్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.
Rohit Sharma doing water sports in Jamnagar 🔥
— Rohan💫 (@rohann__45) March 26, 2025
ఐపీఎల్ టోర్నీలో విజయవంతమైన కెప్టెన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ ముంబైకి ఏకంగా ఐదు ట్రోఫీలు సాధించి పెట్టాడు. ఓపెనర్‌గా, సారథిగా ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషించిన హిట్‌మ్యాన్.. గత సీజన్లో కెప్టెన్నీ నుంచి వైదొలిగాడు. అతడి స్థానంలో హార్దిక్ పాండ్యా పగ్గాలు అందుకున్నాడు. అయితే.. 17వ ఎడిషన్‌లో ముంబై పేలవ ప్రదర్శన కనబరిచింది. 18వ సీజన్‌ను సైతం ముంబై ఓటమితో ఆరంభించింది.
మార్చి 23న చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 4 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే డకౌట్‌గా వెనుదిరిగిన రోహిత్.. గుజరాత్‌పై చెలరేగేందుకు సిద్ధమవుతున్నాడు. మార్చి 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై, గుజరాత్‌లు తలపడనున్నాయి. మరోవైపు పంజాబ్ కింగ్స్‌పై పోరాడి ఓడిన శుభ్‌మన్ గిల్ సేన.. తమ సొంత మైదానంలో పాండ్యా బృందానికి చెక్ పెట్టాలని భావిస్తోంది. దాంతో, ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు అభిమానులను అలరించడం ఖాయం.