గత కొన్నాళ్లుగా ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీకి తాజా సారథి రోహిత్ శర్మ అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో విఫలమైతే కోహ్లీని జట్టునుంచి తప్పిస్తారని వార్తలు వస్తున్న నేపథ్యంలో రోహిత్ స్పందించాడు. అతడిపై విమర్శలు చేస్తున్నవారిపై కూడా హిట్ మ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఆదివారం ఇంగ్లండ్ తో మూడో టీ20 మ్యాచ్ ముగిశాక నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్ మాట్లాడాడు. ‘జట్టులో కోహ్లీ స్థానం గురించి మీ స్పందనేమిటి..?’ అన్న ప్రశ్నకు అతడు సమాధానం చెబుతూ.. ‘బయటవాళ్లు ఏం చెబుతున్నారు..? ఏం విమర్శిస్తున్నారు..? అనేదానిగురించి మేం పట్టించుకోం. అసలు వీళ్లు (విమర్శకులు) ఎవరో.. వారిని ఎక్స్పర్ట్స్ అని ఎందుకు పిలుస్తారో నాకైతే అర్థం కావడం లేదు. వాళ్లు బయటనుంచి మాత్రమే చూస్తున్నారు. కానీ జట్టు లోపల ఏం జరుగుతుందనేది వాళ్లకు తెలియదు.
మేము ఒక ఆలోచనా విధానాన్ని కలిగి ఉన్నాము. జట్టు ఎంపిక, ఎవరిని ఆడించాలి.. అనేదానిపై మేం లోతుగా చర్చిస్తాం. అందుకు మాకు ఒక బృందం కూడా ఉంది. మేము ఎంపిక చేసుకునే ఆటగాళ్లకు మా మద్దతు ఉంటుంది. వాళ్లకు తరుచుగా అవకాశాలిస్తాం. ప్రతీ ఒక్క ప్లేయర్‌కు ఇలాంటి పరిస్థితి (కోహ్లీని ఉద్దేశిస్తూ) వస్తుంది. నేనూ ఇలాంటి ఫేజ్ ను దాటుకునే వచ్చాను. కొన్నేళ్లుగా నిలకడగా ఆడుతున్న ప్లేయర్ సత్తా ఏంటో మాకు తెలుసు. ఫామ్ లేదని అతన్ని పక్కనబెట్టలేం. కానీ బయటఉన్నవాళ్లకు ఇవేవీ తెలియవు. జట్టులో ఏం జరుగుతుందనేదే నాకు ముఖ్యం..’ అని స్పష్టం చేశాడు.
కోహ్లీ పేలవ ఫామ్ నేపథ్యంలో కపిల్ దేవ్, అజయ్ జడేజా, గవాస్కర్ వంటి సీనియర్ క్రికెటర్లు చాలా మంది అతడిని టీ20 ఫార్మాట్ లో పక్కనబెట్టి ఆ స్థానంలో మెరుగ్గా రాణిస్తున్న యువ ఆటగాళ్లకు అవకాశాలివ్వాలని సూచించారు. ఇదిలాఉండగా తాజాగా రోహిత్ వ్యాఖ్యల నేపథ్యంలో విండీస్ సిరీస్ కు కోహ్లీని టీ20 సిరీస్ కు ఎంపిక చేస్తారా..? చేయరా..? అనే చర్చకు ఫుల్ స్టాప్ పడింది.