కొనసాగింపున్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ విజయం రోహిత్‌శర్మ దశాదిశను మార్చేసిందా? అంటే అవుననే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. చాంపియన్స్ ట్రోఫీ తర్వాత వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడా అన్న అనుమానాలను పటాపంచలు చేసిన హిట్‌మ్యాన్..టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐపీఎల్ ముగిసిన వెంటనే జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో మొదలుకానున్న ఐదు టెస్టుల సిరీస్‌కు రోహిత్ సారథ్యంలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ విషయాన్ని బోర్డు వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే దీనిపై ఒక స్పష్టత వచ్చే చాన్స్ ఉన్నట్లు తెలిసింది. ఇంగ్లండ్‌తో సిరీస్ ద్వారా టీమ్ఇండియా డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌ను ఆరంభించనుంది. ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఓటమి తర్వాత రోహిత్ టెస్టు కెప్టెన్సీపై నీలి మేఘాలు కమ్ముకున్నాయి. రోహిత్ స్థానంలో బుమ్రాకు పగ్గాలు ఇచ్చే అవకాశమున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.