T20 World Cup : పొట్టి ప్రపంచ కప్ విజయంతో భారత జట్టు 14 ఏండ్ల నిరీక్షణకు తెరపడింది. బార్బడోస్ వేదికపై సగర్వంగా ట్రోఫీని అందుకున్న టీమిండియా యావత్ భారతావనిని పులకింపజేసింది. మెన్ ఇన్ బ్లూకు ఇది రెండో టీ20 వరల్డ్ కప్ ట్రోఫీ కాగా.. మొత్తంగా నాలుగో వరల్డ్ కప్. అందుకని ఈ ట్రోఫీకి భారత కెప్టెన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రత్యేక పూజులు చేయించాడు. అది కూడా దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన సిద్ధి వినాకుడి ఆలయంలో.
భారత కెప్టెన్ రోహిత్, బీసీసీఐ సెక్రటరీ జై షా(Jai Shah)లు ముంబైలోని బుధవారం సిద్ధి వినాయకుడి (Sidhdi Vinayaka)ని దర్శించుకున్నారు. తమ వెంట తీసుకొచ్చిన ఆ వరల్డ్ కప్ ట్రోఫీని రోహిత్, షాలు విఘ్నేశ్వరుడి సన్నిధిలో పెట్టారు. దాంతో, అక్కడి అర్చకులు ప్రపంచ కప్ ట్రోఫికి ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు.
అనంతరం గణనాధుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ భారత జట్టుపై ఉండాలని రోహిత్, షాలు ప్రార్ధించారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు టీమిండియా సారథి, షాలను గులాబీ రంగు షాలువాలతో సన్మానించారు.
ముంబైలోని సిద్ధి వినాయక దేవాలయం ఎంత పాపులరో తెలిసిందే. దేశ నలుమూలల నుంచే కాకుండా విదేశీయులు కూడా ఈ గుడిని సందర్శించి పులకించిపోతారు. కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరొందిన సిద్ధి వినాయకుడి అంటే భారత్లోని పలువురు వ్యాపారవేత్తలు, బాలీవుడ్ తారలు, క్రికెటర్లకు ఓ సెంటిమెంట్.