Rohit Sharma : టీమిండియా కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) హుందాగా వైదొలిగాడు. వరల్డ్ కప్ విజేతగా వీడ్కోలు పలికిన ద్రవిడ్‌పై మాజీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. 13 ఏండ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించిన ది వాల్‌కు భారత రత్న ఇవ్వాలని సునీల్ గవాస్కర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) సైతం ద్రవిడ్‌పై ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. రెండున్నర ఏండ్ల తమ అనుబంధాన్ని ఒక్క మాటలో వివరించిన రోహిత్.. ద్రవిడ్‌ను తన ‘వర్క్ వైఫ్’గా పేర్కొన్నాడు.
నా మనసులోని మాటల్ని అర్ధవంతంగా వ్యక్తం చేసేందుక సరైన పదాలను వెతుకుతున్నా. మీ నుంచి చాలా నేర్చుకున్నా. నా భార్య రితికా మిమ్మల్ని నా వర్క్ వైఫ్ అని ఎప్పుడూ అంటూ ఉంటుంది. మీకు ఆరోజు ఫోన్ చేసినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నా అని రోహిత్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ పెట్టాడు.
రవిశాస్త్రి తర్వాత కోచ్‌గా వచ్చిన ద్రవిడ్ తన మార్క్ చూపించాడు. రొటేషన్ పద్ధతిన కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ లైనప్‌ను పటిష్ఠం చేశాడు. అంతేకాదు రోహిత్ శర్మతో చక్కని సమన్వయంతో జట్టును ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఆ తర్వాత శ్రీలంక గడ్డపై ఆసియా కప్ విజేతగా నిలిపాడు. అయితే.. సొంతగడ్డపై జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో రోహిత్ సేన ఆఖరి మెట్టుపై తడబడి ఆస్ట్రేలియాకు ట్రోఫీ అప్పగించింది. ఆ ఓటమితో ద్రవిడ్ ఇక కోచ్‌గా ఉండకూడదని డిసైడ్ అయ్యాడు.

అయితే.. ద్రవిడ్‌కు ఫోన్ చేసిన రోహిత్ మనం మరొకసారి ట్రై చేద్దాం. టీ20 వరల్డ్ కప్ కొట్టి తీరుదాం అని నచ్చజెప్పాడు. ఆ తర్వాత బీసీసీఐ కోచ్‌గా వెటరన్ ఆటగాడి కాంట్రాక్ట్ పొడిగించింది. ఇక ఆ తర్వాత రోహిత్, ద్రవిడ్‌లు అనుకున్నట్టుగానే కరీబియన్ గడ్డపై టీ20 వరల్డ్ కప్ గెలిచి చూపించారు. రోహిత్ విషయానికొస్తే.. పొట్టి వరల్డ్ కప్ ట్రోఫీ ఆనందంలో తేలిపోతున్నాడు. బార్బడోస్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో భారత జట్టు విజయానికి గుర్తుగా.. హిట్‌మ్యాన్ జాతీయ జెండాను పాతిన ఫొటోను తన ఎక్స్ డీపీగా మార్చేశాడు.