NEET-UG case : నీట్ యూజీ పేపర్ లీక్ కేసు (NEET-UG paper leak case) లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ (CBI) మరో ఇద్దరిని అదుపులో తీసుకుంది. అరెస్టయిన ఇద్దరు నిందితుల్లో ఒకరు నీట్ అభ్యర్థి కాగా, మరొకరు మరో నీట్ అభ్యర్థి తండ్రి అని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. వారిద్దరూ బీహార్‌కు చెందినవారేనని తెలిపాయి. ఒకరిని నలంద జిల్లాలో, మరొకరిని గయా జిల్లాలో అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు.
నీట్ పేపర్ లీకేజీ అంశం ప్రస్తుతం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. అభ్యర్థులతో ఒత్తిడితో ఈ అశంపై కేంద్రం సీబీఐ ఎంక్వయిరీ వేసింది. ప్రస్తుతం కేసు విచారణ జరుపుతోన్న సీబీఐ కేసుతో సంబంధం పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తోంది. అదేవిధంగా పరీక్ష నిర్వహణలో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నందున రద్దు చేసి మళ్లీ పరీక్ష నిర్వహించాలని 38 మంది అభ్యర్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.
ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. నీట్ యూజీ పరీక్షలను మళ్లీ నిర్వహించే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. దాంతో నీట్ యూజీ పరీక్షలను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని, కేవలం పేపర్ లీక్ అయిన సెంటర్లలో మాత్రమే తిరిగి పరీక్షలు నిర్వహిస్తామని అఫిడవిట్లో పేర్కొంది. ఈ క్రమంలో నీట్ పేపర్ లీకైనట్లు స్పష్టమవుతోందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
పేపర్ ముందుగా ఏ పరీక్షా కేంద్రంలో లీకైంది..? ఎవరు లీక్ చేశారు..? అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందో తెలియజేయాలని సీబీఐని ఆదేశించింది. కేసుకు సంబంధించి సమగ్ర నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వానికి ఆర్డర్ వేసింది. ఈ మేరకు జూలై 10వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఎన్టీఏ, సీబీఐ, కేంద్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 11న జరగనుంది.