Roger Federer : టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ (Roger Federer) ఆటకు వీడ్కోలు పలికి రెండేండ్లు అవుతోంది. అయినా సరే ఈ లెజెండ్ తన టెన్నిస్ జీవితాన్ని మర్చిపోలేకపోతున్నాడు. ఈమధ్యే ఫెదరర్ తన జీవితంపై ఒక డాక్యుమెంటరీ వస్తుందని చెప్పిన విషయం తెలిసిందే. ‘ఫెదరర్ ట్వల్ ఫైనల్ డేస్'(Federer : Twelve Final Days) అనే పేరుతో అమెజాన్ ప్రైమ్(Amazon Prime) రూపొందిన ఈ డాక్యుమెంటరీ అతడి కెరీర్‌లోని ఆఖరి 12 రోజులకు సంబంధించినది.
తన జీవితంలోని ముఖ్యమైన దశ డాక్యుమెంటరీగా వస్తోన్న నేపథ్యంలో ఫెదరర్ ప్రమోషన్లో పనుల్లో బిజీ అయ్యాడు. అందులో భాగంగానే అతడు మాట్లాడుతూ.. రిటైర్మెంట్ అనుభవాన్ని పంచుకున్నాడు. ఒక ఆటగాడి తన కెరీర్‌కు వీడ్కోలు పలకడం అనేది ఓరకంగా అంతిమ యాత్ర లాంటిది. అదొక గొప్ప ఫీలింగ్. మీరు పూర్తిగా స్పృహతోనే ఉంటారు. కానీ, అప్పుడు జరుగుతన్నవన్నీ స్లో మోషన్లో మసకగా మసకగా అనిపిస్తాయి అని ఫెదరర్ అన్నాడు.
ప్రపంచ టెన్నిస్‌లో ఫెదరర్ ఓ శిఖరం. ప్రీట్ సాంప్రాస్, ఆండీ రాడిక్ల శకం నడుస్తున్న రోజుల్లో దూసుకొచ్చిన ఈ స్విట్జర్లాండ్ కెరటం అనతికాలంలోనే తన ముద్ర వేశాడు. పురుషుల సింగిల్స్‌లో తిరుగులేని ఆధిపత్యం చెలాయించాడు. ఒకానొక దశలో టోర్నీ ఏదైనా సరే ట్రోఫీ ఫెదరర్‌దే అని అనుకునేవాళ్లంతా.
చిరకాల ప్రత్యర్థులు నాదల్, ఫెదరర్

రఫెల్ నాదల్, నొవాక్ జకోవిచ్, ఆండీ ముర్రేలు ఎంట్రీ ఇవ్వడంతో అప్పటిదాకా సాగిన ఫెదరర్ ఏకఛక్రాధిపత్యం తగ్గడం మొదలైంది. దానికి తోడు పెరుగుతున్న వయసు, గాయాలు ఈ స్టార్ ఆటగాడిని విశ్రాంతి తీసుకునేలా చేశాయి. చివరకు 2022లో కన్నీటిపర్యంతమవుతూ తనకెంతో ఇష్టమైన ఆటకు ఫెదరర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అక్కడితో టెన్నిస్‌లో ఓ శకం ముగిసిపోయింది. తన సొగసైన ఆటతో కెరీర్లో 20 గ్లాండ్స్లామ్స్ టైటిళ్లు కొల్లగొట్టిన ఫెదరర్ ఇప్పుడు.. డాక్యుమెంటరీతో మరోసారి అభిమానుల ముందుకు వస్తున్నాడు. జూన్ 20వ తేదీన ఈ మహాయోధుడి డాక్యుమెంటరీ విడుదల కానుంది.